సీఆర్డీయే అధికారులకు కనువిప్పు... రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో శుభ్రతా చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించింది. దీంతో గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సాథ్యంలోని వైకాపా ప్రభుత్వం దిగిపోయింది. త్వరలోనే టీడీపీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. అయితే, ఈ ఎన్నికల ఫలితాలు అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారుల వైఖరిలో మార్పును శ్రీకారం చుట్టింది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో రాజధానిలో మార్పు మొదలైంది. వైకాపా పాలనలో గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసిన సీఆర్డీఏ.. ప్రస్తుతం అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది.
అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. రాజధాని సీడ్ యాక్సెస్ రహదారిని అద్దంలా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. రహదారిపై ఉన్న విద్యుత్తు దీపాలకు మరమ్మతులు చేయిస్తున్నారు. ప్రస్తుతం శంకుస్థాపన ప్రాంతంలో సెక్యూరిటీని ఏర్పాటుచేశారు.