బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (17:53 IST)

త్రీ క్యాపిటల్స్‌లో వెనక్కి తగ్గేదిలేదు... ఏ క్షణమైనా విశాఖ నుంచి పాలన... బొత్స

ఏపీకి మూడు రాజధానుల అంశంపై సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్రీ క్యాపిటల్స్ విషయంలో ఏమాత్రం వెనక్కితగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంటే విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సాంకేతికాంశాలను దృష్టిలో వుంచుకుని కొన్ని దుష్టశక్తులు కోర్టులకెక్కి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చన్నారు. 
 
వికేంద్రీకరణ బిల్లు తెచ్చినప్పుడు విశాఖ రాజధాని ప్రక్రియ షురూ అయిందని తెలిపారు. కరోనా నేపథ్యంలో, ఎక్కడ్నించైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న విషయం అందరికీ అర్థమైందని పేర్కొన్నారు.
 
ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపైనా బొత్స స్పందించారు. సీఎం జగన్ పర్యటనపై టీడీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌కు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ దొరికితే ఒకలా, దొరక్కపోతే ఒకలా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. 
 
రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలిస్తే టీడీపీ నేతలకు అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించేందుకే జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారన్నారు. ఈ పర్యటనల్లో ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు. "జగన్ ఢిల్లీ వెళితే ఏదో ఒక విమర్శ చేయడం టీడీపీ పని. వీలైతే సీఎంకు సూచనలు, సలహాలు ఇవ్వండి" అంటూ హితవు పలికారు.