గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (10:22 IST)

కౌన్సిలర్లను అగౌరపరిస్తే ప్రజలతో దాడిచేయిస్తా : అధికారులకు వైకాపా కౌన్సిలర్ వార్నింగ్

ysrcp councillor ramana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. ప్రజలనే కాదు ఏకంగా ప్రభుత్వ అధికారులకు సైతం హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా ధర్మవరం మున్సిపాలిటీ వైకాపా కౌన్సిలర్ రమణ అధికారులపై ఊగిపోయారు. 
 
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చెప్పారు కాబట్టి కౌన్సిల్ సమావేశంలో అధికారులకు గౌరవం ఇస్తున్నా.. లేకుంటేనే ట్రీట్మెంట్ మరోలా ఉండేది. కౌన్సిలనర్లను అగౌరపరిస్తే అధికారులపై ప్రజలతో దాడి చేయిస్తా అంటూ ధర్మవరం 4వ వార్డు వైకాపా కౌన్సిలర్ రమణ ఆగ్రహంతో ఊగిపోయారు. 
 
పైగా సమావేశమందిరంలో ఆయన చిందులు తొక్కుతున్నా కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ సభ్యులెవ్వరూ అభ్యంతరం తెలుపకపోవడం గమనార్హం. ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్ పర్సన్ నిర్మల అధ్యక్షత మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ రమణ తమ అధికార దర్పం ప్రదర్శించారు. 
 
ఇందులో కౌన్సిల్ రమణ మాట్లాడుతూ, నా వార్డు ప్రజల ఇంటి పట్టా సమస్య పరిష్కరించాలని అధికారుల వద్దకు వెళ్తే పట్టించుకోలేదు. పైగా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజల చేతనే దాడి చేయిస్తా అని ఆయన హెచ్చరించారు.