శనివారం, 14 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

హస్తినకు గురిపెట్టిన ఖలీస్థాన్ ఉగ్రవాదులు.. నిఘా వర్గాల హెచ్చరిక

khalistan flag
దేశ రాజధాని ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు ఖలీస్థాన్ ఉగ్రవాదులు కుట్ర పన్నారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు ఖలీస్థాన్ ఉగ్ర నెట్ వర్క్‌కు సంబంధించిన స్లీపర్ సెల్స్ చురుగ్గా పని చేస్తున్నాయని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 
 
కాగా, గత కొంతకాలంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఖలిస్థాన్‌కు మద్దతుగా గోడ ప్రచారాలు, పెయింటింగులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీలోని వికాశ్‌పురి, జనక్‌పురి, పశ్చిమవిహార్, హీరాగర్హ, వెస్ట్ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఖలీస్థాన్‌ ఉగ్రవాదులకు మద్దతు ఉంది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, ఈ పెయింటింగ్స్‌ను, గోడలపై రాతలను చెరిపేశారు. వీటన్నింటినీ బేరీజు వేసిన నిఘా వర్గాలు... ఢిల్లీలో ఖలీస్థాన్ ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించాయి. 
 
కాగా, ఈ నెల 26వ తేదీన జరిగిన భారత గణతంత్ర వేడుకల రోజున కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఖలీస్థాన్ పోస్టర్లు వెలిశాయి. సిక్‌ఫర్ జస్టీస్, ఖలీస్థాన్ జిందాబాద్, రెఫరెండం 2020 వంటి నినాదాలను ఈ పోస్టర్లలో పేర్కొన్నాయి. ఈ పోస్టర్లను అంటించిన వ్యక్తులను ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. మరోవైపు, పోలీసులు మాత్రం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పలు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ కేంద్రాలు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు, రిపబ్లిక్ డే రోజున సిక్ ఫర్ జస్టిస్ పేరుతో ఉన్న ఉగ్రసంస్థకు చెందిన గురు పర్వంత్ సింగ్‌ విడుదల చేసిన ఓ వీడియో సంచలనం సృష్టించింది. ఆ వీడియోలో 'జనవరి 26న ఇళ్లల్లోనే ఉండండి.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీనే మా లక్ష్యం. అదే రోజున ఖలిస్థాన్‌ జెండాను ఆవిష్కరిస్తాం" అంటూ గురుపత్వంత్‌ సింగ్‌ వీడియోలో చెప్పాడు.