శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (08:54 IST)

దళారుల మాటలను నమ్మవద్దు.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణలో అత్యంత పకడ్భంధీగా గ్రామ,వార్డు  సచివాలయాల పరీక్షలు పారదర్శకంగా జరుపుతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి వెల్లడించారు.

వెలగపూడి సచివాలయంలోని మూడో బ్లాక్ లో విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు 5,314 పరీక్షా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో పరీక్షనిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ఏపీపీఎస్సీ, విద్యా శాఖ, యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు.

1174 రూట్ల ద్వారా ఆయా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించడానికి ఒక గెజిటెడ్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఆయా జిల్లాలోని ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూమ్ ల్లో భద్రపరుసున్నామని, ప్రత్యేక సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24x7 ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పరీక్షల నిర్వహణ కోసం 1 లక్ష 22వేల 554 మంది సిబ్బందిని వివిధ స్థాయిల్లో నియమించామని, ఇప్పటికే వారికి శిక్షణ కూడా అందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆగస్టు 24 నుండి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు.

సెప్టెంబర్ 1న నిర్వహించబోయే పరీక్షకు 15 లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకొనగా వారిలో 27వ తేదీనాటికి 12.85 లక్షల మంది (82%)  హాల్ టికెట్లను డౌన్ లోడు చేసుకున్నారన్నారు. జులై 26వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ స్పందనగా రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి వివిధ కేటగిరిలోని 19 పోస్టులకుగానూ 21 లక్షల 69 వేల 719 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

అభ్యర్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు స్వీకరణను ఆగస్టు 11వ తేదీవరకు పొడిగించడం జరిగిందన్న విషయం  ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను అదే రోజు సాయంత్రం ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తరలించి స్కానింగ్ చేస్తారని తెలిపారు.

ఇందుకోసం పకడ్భంధీ ఏర్పాట్ల మధ్య స్కానింగ్ ప్రక్రియను చేపడుతున్నామన్నారు. పరీక్ష రాసే అభ్యర్ధులకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 40 శాతానికి పైగా వికలాంగత్వం కలిగిన అభ్యర్థులకు 50 నిమిషాల అదనపు సమయంతో పరీక్ష రాసేందుకు అనుమతించడం జరుగుతుందన్నారు.

ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధాన కార్యదర్శి కార్యాలయం, పంచాయతీరాజ్ శాఖ, తదితర సమన్వయశాఖల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు దిశానిర్ధేశం చేస్తున్నాయని ఆయన తెలిపారు.