శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (08:48 IST)

రాజధానిపై తక్షణం తేల్చాలి.. టీడీపీ

ఏపీ రాజధాని నిర్మాణానికి అత్యంత విలువైన భూములిచ్చిన రైతులు నేడు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసే విపరీత పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.

గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజధాని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఏమిటి తమకు ఈ దుర్గతి అని మధనపడుతున్నారు. పలు పార్టీల  నాయకులను కలసి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి  జగన్‌ అస్తవ్యస్త నిర్ణయాలు, పాలన నిర్వాకం మూలంగా  ఈ పరిస్థితి ఏర్పడింది. జగన్‌ రాజధానిపై రగడను సృష్టించారా?  బొత్స సత్యనారాయణ  బహుమతిగా ఇచ్చాడో జగన్‌ పున:సమీక్ష చేసుకోవాలి. తక్షణం తేల్చాలి.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒక అద్భుతమైన ప్రజా రాజధాని నిర్మాణం కావాలని  ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు భావించారు. అన్ని వర్గాలవారు, అన్ని ప్రాంతాలవారు కూడా బలంగా కోరుకున్న నేపథ్యంలో అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొన్న  తరువాత 2014, సెప్టెంబర్‌ 4వ తేదిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.

విజయవాడ గుంటూరుల మధ్యన అమరావతి పేరుతో రాజధాని నిర్మాణం జరగాలని తీర్మానం చేశాం. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు.  ప్రజలు కోరుతున్నది ఒక్కటే కేపిటల్‌ సిటీ ఎక్కడైనా పెట్టండి.

కానీ పెట్టిన చోట కనీసం 30 వేల ఎకరాలైనా ఉండాలని మేం మొదటి నుంచి చెబుతున్నామని'' స్వయంగా అత్యంత పవిత్రమైన శాసనసభ  సాక్షిగా జగన్మోహన్‌రెడ్డి ఆనాడు వెల్లడించారు. అప్పట్లో  ముఖ్యమంత్రి చంద్రబాబు భౌగోళికంగా రాష్ట్రం మధ్యలో ఉన్న విజయవాడకు సమీపంలో అమరావతి రాజధాని నిర్మాణానికి నాందిపలికారు.

కానీ ఇప్పటి  మంత్రుల ప్రకటనలు ప్రజల్లో భయం గొలుపుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారో అని అందరూ ఆందోళన చెందుతున్నారు. రాజధానిని ఇష్టారాజ్యంగా మారిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. జగన్మోహన్‌రెడ్డికి, తుగ్లక్‌కి ఏమీ తేడా లేదు. రాజధానిని మార్చిన తుగ్లక్‌ ఏమయ్యాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి.