బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (07:52 IST)

ఏపీలో నవంబరు 16 తర్వాత విద్యుత్ ఉద్యోగుల సమ్మె!

సచివాలయంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా మంత్రి బాలినేని చర్చలు జరిపినా విషయం ఒక కొలిక్కి రాలేదు.

14 అంశాలపై విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఏపీ ట్రాన్సుకో, డిస్కమ్లల్లో  ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని  ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదిస్తున్న ప్రైవేటీకరణ చేయబోమంటూ తెలంగాణా ప్రభుత్వం తరహాలోనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంటు చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు. వీటీపీఎస్, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లల్లో ఉత్పత్తి నిలిపేసి బయట నుంచి కొనుగోళ్లు తగ్గించాలని కూడా విద్యుత్ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే  నవంబరు 16 తర్వాత సమ్మెకు వెళ్తామని హెచ్చరిస్తున్నాయి విద్యుత్ ఉద్యోగ సంఘాలు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించలేదని, మా డిమాండ్ల పై రాతపూర్వకంగా ఇవ్వాలని కోరామని ప్రభుత్వం నుంచి రాతపూర్వకంగా హామీ ఇచ్చే వరకు వెనక్కు తగ్గమని విద్యుత్ ఉద్యోగుల సంఘాల జేఏసీ పేర్కొంది.