బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (10:33 IST)

ఆంధ్రప్రదేశ్‌ లో 30 నైపుణ్య కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో 30 నైపుణ్య వికాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ను నైపుణ్య వికాస కేంద్రంగా అభివృద్ధి చేయబోతున్నామని, అందుకోసం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాలల్లో పాఠ్యప్రణాళిక, అప్‌గ్రేడేషన్‌ పర్యవేక్షణలకు ఒక సెంట్రలైజ్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయలంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి, ఐటీ పాలసీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.

వీటితోపాటు రాష్ట్రంలో ఏర్పాటు చేయదలచిన 30 కేంద్రాల్లో పాఠ్యప్రణాళిక, దాని అమలు తీరు, ఎప్పటికప్పుడు కోర్సులను ఆధునీకరించుకోవడం, పర్యవేక్షణ తదితర కార్యకలాపాలన్నీ ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకొస్తామన్నారు.

తర్వాత దీనిని విస్తరించుకుంటూ వెళ్లాలని అధికారులకు సూచించారు. ఐటీ రంగంలో హై ఎండ్‌ స్కిల్స్‌పై ఒక సంస్థ విశాఖ పట్టణంలో ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. ఇంజనీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి, వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని చెప్పారు.

మొదటగా విశాఖపట్టణంలో తర్వాత దీనికి అనుబంధంగా సెంట్రల్‌ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో తర్వాత కాలంలో రెండు సంస్థలను ఏర్పాటుచేసే దిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీపడే పరిస్థితి రావాలంటే నైపుణ్యాలను ఆ నగరాలతో ధీటుగా అభివృద్ధి చేయడమే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

నైపుణ్య కేంద్రాలన్నీ ఒకే నమూనాలో ఉండాలన్న సీఎం దీనికి సంబంధించిన ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఒక సంవత్సరం వ్యవధిలో వాటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని, దీనికి సంబంధించి ప్రణాళిక పూర్తయ్యేలా చూడాలని ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి గొప్ప ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దాలని అన్నారు. 45 రోజుల్లోగా భూములు గుర్తింపు, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి కావాలని ఆదేశించారు.