బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శనివారం, 22 జనవరి 2022 (16:22 IST)

సాక్షాలు చూపెట్టాం.. కొడాలి నానీ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటావ్ ?

సాక్షాలు చూపెట్టాం.. కొడాలి నానీ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు? ఎప్పడు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని టీడీజీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మంత్రి కొడాలి నానిపై  విరుచుకుప‌డ్డారు. 
 
 
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ తనకు సంబంధించిన కే కన్వెన్షన్ లోను, తనకు సంబంధించిన స్థలాలలో ఎక్కడా జూదం జరగలేదని బుకాయించారని ఆరోపించారు. పైగా నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడార‌ని, గుడివాడలో కొడాలి నానికి సంబందించిన స్థలంలో, కే కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమాలు ఏ సోషల్ మీడియాలో కొట్టినా వస్తాయ‌ని చెప్పారు. 
 
 
నానీకి సంబంధించిన స్థలంలో ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి క్యాసినోలు, జూదాలు, డ్యాన్సులు నిర్వహించారు. ఇవాళ రాష్ట్ర ప్రజల సాక్షిగా మేం ప్రజల ముందు ఉంచాం.  సోషల్ మీడియాలో కో కొల్లలుగా వీడియోలు చూడొచ్చు. కొడాలి నాని బాధ్యత గల ఒక మంత్రిగా ఉండి ఇలా చేయొచ్చా? ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ లో, ఆయనకు సంబంధించిన స్థలంలో  మూడు రోజులపాటు భారీ సెట్టింగులు వేసి, క్యాసినోలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జూదం, డ్యాన్సులు జరిగాయి. అందులో పాల్గొనాలంటే ప్రతి వ్యక్తి పది వేలు చెల్లించాలి. రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి బహిరంగంగా క్యాసినో నడిపిస్తే ముఖ్యమంత్రి, డీజీపీల మౌనం దేనికి సంకేతం? రాష్ట్ర రాజధానిలోని సీఎండీజీపీలుండే కేంద్రానికి అతి సమీపంలో ఒక మంత్రి ఇంతగా బరితెగించి క్యాసినోలు, డ్యాన్సులు చేయిస్తే ప్రభుత్వ వ్యవస్థలకి తెలియకుండా పోతుందా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? పరిపాలన సాగుతోందా? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి అని న‌రేంద్ర పేర్కొన్నారు.
 
 ఇన్ని అఘాయిత్యాలకు పాల్పడిన మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయరు? దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి ఇందుకు సహకరిస్తూ, సమర్థిస్తున్నట్లుగా ఉంది. మా వాళ్లు మూడు రాజధానులే అంటున్నారు, కొత్తగా మాకు నాల్గవ రాజధాని వచ్చిందని వైసీపీ నాయకులే అంటున్నారు. కొత్తగా జూద రాజధానిగా గుడివాడ అని చెప్పుకోవచ్చేమో. నిరూపించండి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా, రాజకీయాలు మానేస్తాను, సన్యాసం పుచ్చుకుంటా అని నాని అన్నారు, అదెప్పుడు చేస్తారో అని ఎద్దేవా చేశారు. 
 
 
 ఏసిస్ క్యాసినోతో వైసీపీ నాయకులు బేరం కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా? అఫిషియల్ గా నానీ నిర్వాహకుడు కాదా? ఏసిస్ క్యాసినో ప్రేమల్ టోపీవాలా వైసీపీ మనిషి కాదా?. అఫిషియల్ పేజీలో పేర్కొనలేదా? కళ్లముందు నిలువెత్తు నిజాలు కనబడుతున్నాయి. ఏఎస్ఎస్ క్యాసినోవారితో ఒప్పందం చేసుకొని వారిని గుడివాడకు తీసుకొచ్చి మూడు రోజులపాటు గుడివాడలో క్యాసినో నిర్వహించారు. మేం నిరూపించాం. చిత్తశుద్ధి ఉంటే  రాజీనామా మీరెప్పుడు చేస్తారు? నాని నిరూపించండి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా, రాజకీయాలు మానేస్తాను, సన్యాసం పుచ్చుకుంటా అని నాని ఎప్పడు చేసుకుంటారు? అని ప్ర‌శ్నించారు.
 
 
 
చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తే మీరు చేసిన తప్పులు ఒప్పులైపోతాయనుకోవద్దు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి  పౌరులకు ఉపయోగపడాల్సివారు ఆ పనిని గాలికొదిలేశారు. క్యాసినోలు నడింపించడంలో ఉన్న శ్రద్ధ రైతుల మీద, ఆ శాఖ నిర్వహణ మీద లేకపోవడం బాధాకరం. ఫొటోలు, వీడియోలు బహిరంగంగా కనపడుతుంటే ఇంకా సాక్ష్యాలు కావాలా? మూడు రోజులుగా గుడివాడ నడిబొడ్డులో క్యాసినో, జూదాలు, డ్యాన్సులు నిర్వహిస్తుంటే పోలీసులు ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. సామాన్యులు పేకాట ఆడితే దాడి చేసి పట్టుకొని కేసులు నమోదు చేస్తారు. ఫైన్లు వేస్తారు.  ఇంత పబ్లిక్ గా ఫేస్ బుక్ లలో, సోషల్ మీడియాల ద్వారా  ప్రచారం చేసి, బహిరంగంగా డబ్బులు వసూలు చేశారు. అయినా చర్యలు లేవు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడో లేడో అర్థం కావడంలేద‌న్నారు.