సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:38 IST)

లంకల్లో విపరీతంగా ఇసుక తవ్వకాలు

కృష్ణ జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లంకల్లో తీవ్రంగా ఇసుకను తవ్వేస్తున్నారు. గత 20 రోజుల్లో అవనిగడ్డకు అతి సమీప లంక గ్రామాలైన ఎడ్లంక, వేకనూరు శివారు లంక భూముల నుంచి అక్రమ రవాణాదారులు పెద్దఎత్తున తరలిస్తున్నారు.

దీంతో లంకలు రూపు కోల్పోయి వాటిని ఉనికికే ప్రమాదమేర్పడుతుందని ఎడ్లంక, వేకనూరు ప్రజలు వాపోతున్నారు. ఎడ్లంక, బందలాయి చెరువు, వేకనూరు రేవుల నుంచి రోజూ దాదాపు 200కు పైగా ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది.

వరదల కారణంగా మేట వేస్తున్న ఇసుకను తొలగించుకొనేందుకు కొందరు రైతులకు 2013లో కోర్టు అనుమతి ఇచ్చింది. కొందరు అక్రమార్కులు రెండు గ్రామాల పరిధిలోని లంక భూములను అడ్డంగా తవ్వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు అండగా నిలుస్తూ ఉండటంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిపోతోందని సమాచారం. మేట వేసిన ఇసుకను తొలగించేందుకు అనుమతి పొందిన రైతులు వే బిల్లుల ద్వారా తమ పొలంలోని ఇసుకను బయటకు తరలిస్తున్నారు.

ఆ బిల్లులనే ఆధారంగా చేసుకొని కొందరు అక్రమార్కులు ట్రాక్టరు యజమానులతో చేతులు కలిపి సమీపంలోని రేవు నుంచి, లంక గట్ల నుంచి పెద్దఎత్తున ఇసుకను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ఓ ప్రముఖ నేతకు ఇందులో 30 శాతం మేర వాటాలుండటంతో ఈ రవాణా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల వచ్చిన వరదల కారణంగా ఎడ్లంక దీవి భారీగా కోతకు గురవుతూ ఉండగా ఎడ్లంక నుంచి వేకనూరు వరకు ఉన్న లంక గట్లను ఇసుక కోసం తవ్వుకుంటూ పోతే అది రేపు తుంగలవారి పాలెం, నాగాయలంక గ్రామాలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని లంకల రైతులు వాపోతున్నారు.
 
పాత ఎడ్లంక, వేకనూరు గ్రామాల పరిధిలోని లంక భూముల్లో ఇసుకను ఎక్స్‌కవేటర్‌తో తవ్వి పోయడమే కాక సమీపంలోని రేవు నుంచి సైతం ఇసుకను డ్రెట్జర్లతో తోడి గుట్టలు పోసి ఆ ఇసుకను ట్రాక్టరు ఒక్కింటికి రూ. 2000కు విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ప్రభుత్వ డిపోల నుంచి ఇసుక కొనుగోలు చేయాలంటే యూనిట్‌ ఒక్కింటికి కనీస మొత్తంగా రూ. 750 ధర ఉంంది. ట్రాక్టర్‌ ఒక్కింటికి ఇసుకను కొనుగోలు చేసేందుకే రూ.3000 కు పైగా ఖర్చు అవుతూ ఉండటం ట్రాక్టర్‌ కిరాయి ఖర్చులు కూడా ఆదనంగా పడుతూ ఉండటంతో ఇసుక మాఫియా కేవలం రూ. 3000 నుంచి రూ. 3500 లకే ఇసుకను వినియోగదారుడు కోరిన చోటుకు తరలిస్తున్నారని తెలుస్తోంది.
 
ఎడ్లంక, వేకనూరు రేవుల నుంచి అటు అవనిగడ్డ మండలానికి ఇటు నాగాయలంక మండలానికి రోజూ ట్రాక్టర్ల ద్వారా పెద్ద ఎత్తున ఇసుక తరలిపోతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వ్యవసాయం కోసం తాము ఒక బండి ఇసుకను బయటకు తోలితే ఇబ్బందులు పెట్టే అధికారులు ఇలా పట్టపగలే వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను తరలింపు చేస్తుంటే ఎవరూ స్పందించడం లేదని ఎడ్లంక వాసులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
కఠిన చర్యలు తీసుకుంటాం
ఎడ్లంక, వేకనూరు రేవుల నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. నది నుంచి ఎవరూ ఇసుక తోలకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నాం.

అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -విక్టర్‌ బాబు, తహసీల్దార్‌, అవనిగడ్డ