కర్నూలులో పేలుడు పదార్థాలు స్వాధీనం
భారీఎత్తున జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు డిఎస్‌పి కె.వి.మహేష్ అన్నారు. శనివారం కర్నూలు రూరల్ పోలీసు స్టేషన్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యం.శ్రీనాథ రెడ్డి ఆధ్వర్యంలో కె.నాగలపురం ఎస్‌ఐ యం.కేశవ తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయం తనిఖీలను నిర్వహించారన్నారు.
ఈ తనఖీల్లో ఎలాంటి లైసెన్సు, అనుమతులు లేకుండా కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామానికి చెందిన బోయ రామానాయిడు అనే వ్యక్తి పేలుడు పదార్థాలు ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వీరిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 782 జిలిటెన్ స్టిక్స్, 800 డిటోనేటర్లను గుర్తించామన్నారు. వాటితో సహా వాటిని తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
నిందితుడిని విచారించగా అతను ఉలిందకొండ నివాసి అయిన అనుముల శ్రీనివాసులు అలియాస్ వాసయ్య అను వ్యక్తి వద్ద నుండి ఆ పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. వాటిని ఆలూరు వద్ద ఉన్న రైతుల పొలాలలో ఉన్న కొండరాళ్ళను బ్లాస్టింగ్ చేయడానికి తీసుకొని వెళ్తున్నామని తెలిపారు.
సిఐ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ అనుముల శ్రీనివాసులు బ్లాస్టింగ్ లైసెన్సు కలిగి ఉన్నప్పటికీ, వాటిని అమ్మడానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. తను అనుమతి పొందిన బ్లాస్టింగ్ పనుల కోసం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. తాను వినియోగించుకోగా మిగిలిన కొన్ని పేలుడు పదార్థాలను అక్రమంగా ఇతరులకు అమ్మినట్లుగా తెలిసిందన్నారు. ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు.
పరారీలో వున్న అనుముల శ్రీనివాసులును అరెస్టు చేయడానికి స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో కె.నాగలపురం ఎస్‌ఐ ఎం. కేశవ, హెడ్ కానిస్టేబుల్ ఎస్.అసుదుల్లాఖాన్, కానిస్టేబుల్ యం.మంజుకుమార్‌లు పాల్గన్నారు. కేసులో ప్రతిభను కనబరిచిన పోలీసు సిబ్బందిని కర్నూలు టౌన్ డిఎస్‌పి కెవి మహేష్ ప్రత్యేకంగా అభినందించారు.