శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (11:19 IST)

అంతరాష్ట్ర వాహనాల దొంగ, విక్రేత అరెస్ట్: రూ.20 లక్షలు విలువైన 31 ద్విచ‌క్ర వాహ‌నాలు, గూడ్స్ వ్యాన్ స్వాధీనం

విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు తెలిపారు.

వ‌న్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నేరాల నియంత్ర‌ణ‌లో భాగంగా పోలీస్‌స్టేషన్ల పరిధిల్లో ముమ్మరమైన గస్తీ ఏర్పాటు చేయడంతో పాటు అంతర్ రాష్ట్ర నేరస్థులు, పాత నేరస్తులు, జైలు నుండి విడుదలైన నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

ఫ‌‌లితంగా నేర‌స్థుల‌ను అన‌తికాలంలోనే అరెస్టు చేసి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల కాలంలో వివిధ కేసులో నేరగాళ్లను అరెస్ట్ చేసి, చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో విజయవాడ నగరంతో పాటు కృష్ణా జిల్లా వీరవల్లి, తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్‌లో మోటారు వాహనాలను దొంగిలించిన అంతరాష్ట్ర ఘరానా నేరస్థుడిని, మోటారు సైకిళ్ళను కొనుగోలు చేసి అతనికి సహకరించిన రిసీవర్‌ను అరెస్టు చేశామ‌న్నారు.

లా అండ్ ఆర్డర్-2 డిసిపి విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో వెస్ట్ జోన్ ఏసిపి  కె.హనుమంతరావు సారధ్యంలో వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వ‌న్‌టౌన్ క్రైమ్ ఎస్.ఐ.ఎం.శ్రీనివాసరావులు త‌మ  సిబ్బందితో కలసి శుక్ర‌వారం అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు రూ.20 లక్షల విలువైన 31 మోటారు సైకిళ్ళు, ఒక టాటా ఏస్ గూడ్స్ ఆటో స్వాధీనం చేసుకున్నార‌ని పేర్కొన్నారు.

ఈ కేసులో ‌ప్రధాన నిందితుడు అయిన కృష్ణాజిల్లా, ఉయ్యూరు మండలం, మంటాడకు చెందిన పాతూరి సాయి శేఖర్ అలియాస్ పోట్రు సాయి శేఖర్, సాయి, శేఖర్ (52) రిసీవర్ అయిన గుంటూరు జిల్లా, కారంపూడి మండలం, లక్ష్మిపురానికి చెందిన కేతవాత్ రవితేజ నాయక్ అలియాస్ రవి (25)ని అరెస్టు చేశామ‌ని పేర్కొన్నారు.

మద్యం ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడిన పాతూరి సాయిశేఖర్ సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయడానికి మోటారు సైకిళ్ళు, గూడ్స్ వాహనాల దొంగతనాలను మార్గంగా ఎంచుకుని సుమారు ఐదేళ్ల కాలంగా నేరాలకు పాల్పడుతున్నాడ‌ని వివ‌రించారు.

నిందితుడు పార్కింగ్ చేసిన మోటారు వాహనాలను ఎంచుకుని రాత్రి, పగటి సమయాలలో మారు తాళాలు ఉపయోగించి దొంగతనాలు చేస్తాడు.

ఈ క్రమంలో నిందితుడు విజయవాడ వ‌న్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో-7, టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో-1, పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలో-6, పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో-6, ఉయ్యూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో-1, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో-4, కృష్ణాజిల్లా బంటుమిల్లిలో-1, గుంటూరు జిల్లా గుంటూరు అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో-1, అరండల్‌పేటలో-1, మంగళగిరిలో-1 మొత్తం 29 నేరాలు చేసి జైలుకు వెళ్లడం జరిగింద‌న్నారు.

గ‌త ఏడాది జూలై నెలలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చిన పాతూరి సాయి తన పాత నేరప్రవృత్తిని మానకుండా తిరిగి మోటారు వాహనాల దొంగతనాలు ప్రారంభించాడు. ఈ క్రమంలో విజయవాడ ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో-12, కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో-6, గవర్నరుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో-1, మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో-1, కృష్ణాజిల్లా వీరవల్లిలో1, తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ నగరంలో-11 మొత్తం 32 నేరాలు చేయడం జరిగింద‌ని తెలిపారు.

నిందితుడు దొంగిలించిన మోటారు వాహనాలను కేతవాత్ రవితేజ నాయక్ ద్వారా విక్రయించగా, దొంగ సొత్తు అని  తెలిసి కూడా వాటిని కొనుగోలు చేయడం జరిగింద‌ని సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో నగరంలో జరుగుతున్న ఈ తరహా ద్విచ‌క్ర వాహనాల చోరీలపై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన వ‌న్‌టౌన్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు, క్రైమ్ ఎస్సై ఎం.శ్రీనివాసరావు, జి.శంకర్‌రావు, హెచ్‌సి (నెం1556) యు.లోకేష్, పోలీస్ కానిస్టేబుళ్ళు (నెం.1817) ఎస్.నాగబాబు, (నెం.3657) ఐ.వెంకటరమణలతో నిఘా ఏర్పాటు చేసి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు భారీగా దొంగిలించిన మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్న‌ట్లు సీపీ వెల్ల‌డించారు.

కేసు దర్యాప్తులో చురుగ్గా పాల్గొని నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని ఈ సంద‌ర్భంగా పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు అభినందించారు.