మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 25 జులై 2020 (09:28 IST)

44 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరు స్మగ్లర్లు అరెస్ట్

శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. దాదాపు 40 మంది తమిళ స్మగ్లర్లు వారం రోజుల పాటు అడవుల్లో ఉంటూ 44 ఎర్ర చందనం దుంగలను అక్రమ రవాణా చేస్తుండగా, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు.

దీంతో ఎదురుదాడికి దిగిన స్మగ్లర్లు, ఒక కానిస్టేబుల్ ను గాయపరిచారు. ఇద్దరు స్మగ్లర్లను పట్టుకోగా, మిగిలిన వారు దుంగలను పడేసి పారిపోయారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. దుంగలను లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న బొలెరో జీప్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇంచార్జి రవిశంకర్ తెలిపారు.

ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ ఎస్ ఐలు వాసు, లింగాధర్ గత మూడు రోజులు గా శ్రీనివాస మంగాపురం అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా, పక్కా సమాచారంతో స్మగ్లర్లపై దాడి చేసినట్లు తెలిపారు. తమిళనాడు జవ్వాది మలైకు చెందిన ప్రభు (30), సురేష్ (32) లను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ చేసిన సమయంలో ప్రభు ఒక కానిస్టేబుల్ ను గాయపరిచి నట్లు తెలిపారు. ఇతను 2014లో అటవీశాఖ అధికారులను హత్య చేసిన కేసులో ముద్దాయి అని, సురేష్ కూడా భాకరా పేటలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టు బడి శిక్ష అనుభవించిన నేరస్తుడని తెలిపారు.

కాగా ఇటీవల కొందరు ఫారెస్ట్ అధికారులు మీడియాతో శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్ల సంచారం లేదని పేర్కొన్నారని, అది పూర్తిగా అవాస్తవమని ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. డిఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ.. కరోనాకు జడవకుండా తమ సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు.

ఈ సమావేశంలో సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ భాస్కర్, ఆర్ ఎస్ ఐలు వాసు, లింగాధర్, అటవీ అధికారులు పి.వి నరసింహ రావు, జానీ బాషా తదితరులు పాల్గొన్నారు.