ఖుష్బూ అరెస్టు... ఎందుకో తెలుసా?

khushbu arrest
ఎం| Last Updated: మంగళవారం, 27 అక్టోబరు 2020 (13:42 IST)
విడుతలై చిరుతైగల్‌ కచ్చి (విసికె) చీఫ్‌ థోల్‌ తిరుమవళవన్‌ మనుస్మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగేందుకు యత్నించిన బిజెపి నేత, సినీ నటి ఖుష్బును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చెంగల్‌పట్టులో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. మనుస్మృతి మహిళలను కించపరిచేదిగా ఉందని, మనుధర్మం వారిని వేశ్యలుగా పరిగణిస్తోందని పేర్కొంటూ థోల్‌ ఇటీవల ఓ చోట ప్రసంగించారు. మనుస్మృతిని నిషేధించాలంటూ డిమాండ్‌ చేశారు. దీనిపై మండిపడ్డ బిజెపి శ్రేణులు..ఆయన క్షమాపణ చెప్పాలని కోరాయి.

ఈ వ్యాఖ్యలు మత ఘర్షణలకు తావునిచ్చేవిగా ఉన్నాయంటూ తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు బిజెపి మహిళా విభాగం పిలుపునిచ్చింది. దీంతో ఆందోళనలు చేపట్టేందుకు వెళుతున్న ఖుష్బును పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

తనపై వస్తున్న విమర్శలకు థోల్‌ సైతం గట్టిగానే స్పందించారు. తాను మనుస్మృతిని మాత్రమే నిషేధించాలని చెప్పానని, ఘర్షణలను ప్రేరేపించేందుకు బిజెపి నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు.

బిజెపి శ్రేణుల ఫిర్యాదు మేరకు థోల్‌పై కేసు నమోదైంది. ఆయనపై కేసు నమోదు చేయడాన్ని డిఎంకెతో పాటు ఇతర ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా ఖండించాయి.
దీనిపై మరింత చదవండి :