కలిసి కట్టుగా అందరూ బాగా పనిచేస్తేనే విజయం : జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప
కర్నూలు నగరంలోని దిశా పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.
దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీ వెంకట్రామయ్యతో మాట్లాడి దిశా పోలీసు స్టేషన్ సిబ్బంది యొక్క పనితీరు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు సిబ్బందికి తెలియజేశారు.
ఆ తర్వాత ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి దిశా పోలీసుస్టేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యల గురించి ఆరా తీశారు. కేసుల తీవ్రతను బట్టి వాటిని త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. ఆ కేసుల విచారణను చేపట్టవలసిన విధానం గురించి దిశా, నిర్దేశం చేశారు.
దిశా పోలీసుస్టేషన్‌కు ఒక మిని బస్సును, 60 స్కూటీలను ప్రభుత్వం కర్నూలు జిల్లాకు కేటాయించిందన్నారు. దిశా పోలీస్ స్టేషన్ మహిళలకు అండగా నిలవాలన్నారు. 50 శాతం మహిళ పోలీసులే దిశా పోలీసుస్టేషనులో ఉండాలన్నారు.
సమస్యలు పరిష్కారమవుతాయనే భావన ప్రతి ఒక్కరిలో కలిగించే విధంగా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే విజయం సాధిచగలుగుతారన్నారు. దిశా పోలీసుస్టేషన్‌కి వచ్చిన వారితో ముందుగా మర్యాద పూర్వకంగా, కుటుంబ సభ్యులవలె మాట్లాడి వారి సమస్యకు పరిష్కార మార్గం చూపాలన్నారు.
కుటుంబ సమస్యలతోగానీ, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ నేరాల గురించి ఎక్కుగా మహిళలు వస్తుంటారన్నారు. వారి సమస్యను మీ సమస్యగా భావించి వారి బాధలను అర్థం చేసుకొని వారితో మాట్లాడి సమాచారం సేకరించుకొని వాటికి అనుగుణంగా పరిష్కార మార్గం చూపాలన్నారు.
ప్రతి రోజు స్కూల్స్, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మొదలగు ప్రాంతాలలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మహిళలపై నేరాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏదైనా సమాచారం సంఘటనలు జరిగినట్లు అందిన వెంటనే సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని వారికి మేమున్నామంటూ ధైర్యాన్ని వారిలో నింపాలన్నారు.
దిశా పోలీస్ స్టేషన్ పోలీసు సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు కల్పించిందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దిశ యాప్ గురించి విస్తృత ప్రచారం, అన్ని విభాగాల మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. దిశ యాప్‌తోనే మహిళలకు సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు.