ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (13:01 IST)

పరిషత్ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: సీఎం జగన్‌

కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరముందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితేనే వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతుందన్నారు. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో సీఎం సమావేశమయ్యారు. 
 
ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందన్నారు. పుర ఎన్నికల తర్వాత పరిషత్‌ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేదని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై గవర్నర్‌, హైకోర్టుకు నివేదించాలని సీఎం సూచించారు. 
 
వ్యాక్సినేషన్‌కు గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని.. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షల సంఖ్య పెంచాలని చెప్పారు. నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా చూడాలన్నారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం.... 
గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత గెలుపొందారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడడంతో ఆమె విజయం సాధించారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 
 
ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా కల్పలత మీడియాతో మాట్లాడారు. ‘‘నా విజయం కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను. మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నేను స్థానికురాలు కాదనే అభిప్రాయం ఎక్కడా వ్యక్తం కాలేదు’’ అని కల్పలత అన్నారు.
 
ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీచేశారు. 12,554 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెల్లని ఓట్లు పోగా కల్పలత విజయానికి 6,153 ఓట్లు అవసరమని అధికారులు నిర్ణయించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికి 6,153 ఓట్లు రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టి కల్పలతను విజేతగా ప్రకటించారు..