విజయవాడ నగర మేయరుగా భాగ్యలక్ష్మి
విజయవాడ నగర వైసీపీ మేయర్ అభ్యర్ధిగా భాగ్యలక్ష్మి పేరును దాదాపుగా ఖరారు చేశారు. బీసీ వర్గాలకు మేయర్ పదవి ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. అలాగే, ఇద్దరు డిప్యూటీ మేయర్లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేయనుంది. విజయవాడ మేయర్ స్థానాన్ని ఓసీ మహిళకు కేటాయించారు. మొదటి మేయర్ రేసులో 34వ డివిజన్ నుంచి గెలుపొందిన బండి పుణ్యశీల, 42 నుంచి గెలుపొందిన పగిడిపాటి చైతన్యరెడ్డి, మూడో డివిజన్ నుంచి గెలుపొందిన భీమిశెట్టి ప్రవల్లిక పేర్లు వినిపించాయి. కానీ, చివరకు భాగ్యలక్ష్మి పేరును ఖరారు చేశారు.
ఇదిలావుండగా, నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే సభ్యులకు ఫారం-2 నోటీసులు అందించగా, వారి కోసం కౌన్సిల్ హాల్లో సీట్లు సర్దుబాట్లు చేస్తున్నారు. సమావేశ మందిరంలో దక్షిణం వైపున మేయర్ సీటు పోను, అధికార పక్షానికి చెందిన 48 మంది సభ్యులకు ప్రత్యేక సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టారు.
ఉత్తరం వైపు ప్రతిపక్ష తెదేపా సభ్యులకు 14 సీట్లు, వారి పక్కన సీపీఎం సభ్యునికి ఒక సీటు కేటాయించేలా సర్దుబాటు ప్రక్రియ చేపట్టారు. కోఆప్షన్ సభ్యుల కోసం కౌన్సిల్ వెనుకభాగంలో మరో 7 సీట్లు కేటాయించి ఉంచుతున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదైన ఎంపీ, మంత్రి, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యుల కోసం ముందు వరుసలో ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేస్తున్నారు.
కౌన్సిల్ హాలు, మేయర్ కార్యాలయానికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. డిప్యూటీ మేయర్, అధికార, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌లీడర్లకు, కార్పొరేటర్లకు ప్రత్యేకంగా కార్యాలయాలు కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుతం అక్కడ వివిధ విభాగాలు పనిచేస్తున్నాయి. వాటిని ఖాళీ చేయించడమా, తరలించడమా అనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
అదేవిధంగా గురువారంనాడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి ఎన్నికైన సభ్యులు మినహా, ఇతరులు ఎవరినీ నగరపాలక సంస్థ ప్రాంగణంలోకి అనుమతించకుండా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికైన సభ్యులకు ఇప్పటికే జారీచేసిన ఫారం-2ను తమ వెంట తెచ్చుకునేలా ప్రత్యేక సూచనలు చేశారు. ఇతర ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.