శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (18:46 IST)

చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎలాంటి చర్యలు తీసుకుంటారు : అంబటి రాంబాబు ప్రశ్న

పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకుంటారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థల కోసం నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లు సుదీర్ఘమైన మీడియా సమావేశాలు నిర్వహించారు. 
 
ఇద్దరూ సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేశారు. రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాకపోయినా, చంద్రబాబు ఒక  రాజకీయ నాయకుడు,  అధికారం లేకపోయినా ఆయన పదే పదే మీడియా సమావేశాలు పెట్టడం, సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రజల్ని విసిగించడం ఆయనకు అలవాటుగా మారింది.  చంద్రబాబు మీడియా సమావేశాల్లో.. అధికారం పోయిందనే బాధ, అసహనం, మళ్ళీ ఇక అధికారం రాదన్న ఫ్రస్ట్రేషన్ ఆయన చూపిస్తున్నారు. ఆయనకు అనుకూలమైన టీవీ ఛానల్స్ కూడా ఆ సోది చూపించలేక సగంలోనే తీసివేశాయి. 
 
రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న ఒక వ్యక్తి మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించవల్సిన అవసరం ఉంటుందా..? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేటప్పుడో, వాటి విధి విధానాలు వివరించేటప్పుడో క్లుప్తంగా మీడియా సమావేశాలు పెట్టడం ఆనవాయితీ. కానీ చంద్రబాబు నాయుడు మాదిరిలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదే పదే మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. 
 
రాజ్యాంగ ప్రకారం ఆయనకు చాలా అధికారాలు వస్తాయి. అయితే వాటిని కాగితం మీద, పెన్ను ద్వారా ఉపయోగిస్తారు. ఒకవైపు అవి చేస్తూనే.. మరోవైపు ఆయన పదే పదే మీడియా ముందుకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ, ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేయడం రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న పెద్దలకు సమంజసమా..?
 
అందుకే ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగస్ఫూర్తితో పనిచేయడం లేదు. చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నారు అని అంటున్నాం. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోయాలని చూస్తున్నారు. వాస్తవానికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. పంచాయితీ ఎన్నికల్లోనో, స్థానిక ఎన్నికల్లోనో గెలవటానికి చంద్రబాబు, ఎస్ఈసీ ఇద్దరూ కలిసి పనిచేసినా ఆ పార్టీని బ్రతికించలేరు, కనుచూపు మేరలో అది సాధ్యం అయ్యే పని కూడా కాదు. 
 
మాట్లాడితే ఎస్ఈసీ సుప్రీంకోర్టు ఆదేశాలు అని మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు తీర్పుల్ని గౌరవించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా తీసుకొని ఎస్ఈసీ లేని అధికారాలను చలాయించాలనుకోవడం, కర్ర పెత్తనం చేయాలని చూడటం కరెక్టు కాదు. ప్రజాస్వామ్యంలో మితిమీరి ప్రవర్తిస్తే.. ఎవరైనా లక్ష్మణ రేఖ దాటితే అటువంటి వారికి అంతిమంగా ప్రజలే బుద్ధి చెబుతారు. 
 
రాష్ట్రంలో, దేశంలో ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నట్టు, ఏకగ్రీవమైన గ్రామ పంచాయితీలకు ప్రోత్సాహకాలు కొత్తగా ఈ ప్రభుత్వమే ఇస్తున్నట్టు కొన్ని రాజకీయ పక్షాలు మాట్లాడటం దురదృష్టకరం. ఏకగ్రీవాలు జరగకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా.? ఉంటే చూపించండి అని ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్న ఈ ప్రతిపక్షాలను అడుగుతున్నాను. 
 
గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగటం అన్నది సర్వ సాధారణం. కొన్ని సందర్భాల్లో ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు ఉత్పన్నం కాకుండా, పదవీ కాలాన్ని సగం సగం అంటూ పంచుకోవడం కూడా గతంలో చూశాం. ఏకగ్రీవాలను కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో వారే సమాధానం చెప్పాలి. 
 
 
పంచాయితీ ఎన్నికలకు చంద్రబాబు ఈరోజు మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్న వారందరికీ ఇదో విచిత్రంగా ఉంది. ఈ మేనిఫెస్టోలో ఒకవైపు చంద్రబాబు, మరోవైపు తన కొడుకు లోకేష్ ఫోటోలు కూడా వేశారు. ఇవన్నీ చూస్తుంటే.. పిచ్చి ముదిరింది, రోకలి చుట్టమన్నట్టు ఉంది.. చంద్రబాబు వ్యవహారం. గ్రామ పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం ఏమిటి..? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా.. ? పల్లెల్లో  జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకూడదని, పార్టీలకు అతీతంగా పంచాయితీ ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే.. చంద్రబాబు పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేస్తారా..? 
 
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా...? ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకుంటారు.? మీకు  చంద్రబాబు సన్నిహితుడైనా సరే, ఆయనపై ఏం యాక్షన్ తీసుకుంటారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా. 

చంద్రబాబు చేసిన ఈ దుర్మార్గం మీద చట్టపరంగా చర్య తీసుకునే ఉద్దేశం నిమ్మగడ్డకు ఉందా? లేదా?. ఉంటే, టీడీపీ గుర్తింపు రద్దు చేస్తారా? లేక కోర్టులో కేసులు వేసి లంచ్‌ మోషన్లు, హౌజ్‌ మోషన్లు వేస్తారా?
 
నిష్పక్షపాతంగా, రాజ్యాంగ స్ఫూర్తితో  పనిచేస్తున్నానని చాగంటి, ఉషశ్రీ, గరికపాటిని మించిపోయి నీతి ప్రవచనాలు చేస్తున్న ఎస్ఈసీ, గుర్తుల్లేని పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన మతి పోయిన మాజీ ముఖ్యమంత్రిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తక్షణం సమాధానం చెప్పాలి. వాస్తవానికి చంద్రబాబు మీడియా సమావేశం పెట్టిన వెంటనే ఈపాటికే ఎస్ఈసీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై ఫలానా చర్యలు తీసుకుంటున్నానని చెప్పి ఉండాల్సింది, కానీ అలా జరగలేదు. 
 
ఎస్ఈసీ తన అధికారాలను ఉపయోగించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. తాను  హైదరాబాద్ లో ఉంటూ.. దుగ్గిరాలలో ఓటు హక్కు కావాలంటే ఎవరైనా ఎలా ఇస్తారు..?  మీరు హైదరాబాద్ నుంచి విత్ డ్రా కాలేదు కదా.. భవిష్యత్తులో తన స్వగ్రామం దుగ్గిరాలలోనే ఉంటాను కాబట్టి, ఓటు ఇవ్వమంటే ఎవరైనా ఇప్పుడు ఎలా ఇస్తారు?

నిమ్మగడ్డ హైదరాబాద్ నుంచి ఖాళీ చేసి వస్తే.. అప్పుడు ఇక్కడ ఓటు ఇస్తారు. దాని మీద కూడా ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే.. అధికారుల మీద కక్ష కట్టినట్టుగా, వారిపై కక్ష తీర్చుకునే విధంగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని, పార్టీని అస్థిరపరచాలని పరకాయ ప్రవేశం చేసినటువంటి చంద్రబాబు ద్వారా ఎస్ఈసీ ఇటువంటి పనులు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.