ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (07:35 IST)

వింత రోగంతో ప్ర‌జ‌ల్లో భయం ప‌ట్టుకుంది: మంత్రి ఆళ్లనాని

అంతుచిక్క‌ని వ్యాధితో విజ‌య‌వాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు బాధితులను మంత్రి ఆళ్లనాని పరామర్శించారు. విజయవాడ ఆసుప‌త్రికి చేరుకున్న మంత్రి  బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

వింత వ్యాధికి సంబంధించి రీసెర్చ్ సంస్థలన్నీ శాంపిల్స్ సేకరించాయని, బాధితుల్లో సీసం రక్తం, నికెల్ ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదిక వస్తుందని ఆళ్ల నాని పేర్కొన్నారు. మరోవైపు ఏలూరులో వింత వ్యాధి కేసులు తగ్గుముఖం పట్టాయి.

బుధవారం రాత్రి నుంచి కొత్త కేసులు నమోదు కాలేదు. ఇప్పటివరకు మొత్తం 592 కేసులు నమోదయ్యాయి. వ్యాధి నుంచి కోలుకుని 511 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏలూరు వాసులకు వింత రోగం సృష్టించిన భయం అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఏం తాగాలన్నా.. తినాలన్నా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. వణికిస్తున్న ఈ వ్యాధిని గుర్తించి, ఎప్పుడు అంతం చేస్తారోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నార‌ని పేర్కొన్నారు.