సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (17:34 IST)

మావోలకు సహకరించారు.. బెయిల్‌పై వస్తే మళ్లీ అరెస్ట్ చేశారు..?

మావోయిస్ట్ కార్యకలాపాలకు సహకరించారని అరెస్టయిన ముగ్గురు మహిళలలో ఇద్దరికి బెయిల్ లభించగా, కేంద్ర కారాగారం నుండి విడుదలై వస్తున్న వారిలో ఒకరిని మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై మరో కేసు బనాయించి లోపలికి తోసారు. ఈ చర్యపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. 
 
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిమ్మయ్యపాలెంకు చెందిన ఆత్మకూరు భవాని (38), ఆత్మకూరు అన్నపూర్ణ (32), ఆత్మకూరు అనూష(26) అక్కాచెల్లెళ్లు. హైదరాబాద్‌ మౌలాలీలో నివాసం ఉంటున్న వారు, మావోయిస్ట్ కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపించబడి డిసెంబరు 23న విశాఖ కేంద్ర కారాగారానికి వెళ్లారు.

వీరిలో భవాని, అనూషకు బెయిల్ లభించగా బుధవారం విడుదలయ్యారు. బయటకు వస్తున్న అనుషను జి.మాడుగుల పోలీసులు నీపై మరో కేసు ఉందని ఆమెను అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. 
 
తమను అసలు అన్యాయంగా అరెస్ట్ చేశారని, తాము ఎలాంటి నేరం చేయలేదని భవాని, అనూషలు వాదిస్తున్నారు. దీనిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. అనుషపై మోపిన కేసులను తక్షణమే ఎత్తివేసి విడుదల చేయాలని ఏపీ, తెలంగాణ పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి. 
 
బెయిల్‌పై విడుదలైన ఆమెను అక్రమంగా మళ్లీ అరెస్ట్ చేసారని, ఆమెపై వారెంట్ ఉండగా ఇంతకాలం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించాయి. ఎన్ని వారెంట్లున్నా ఒకే రిమాండ్‌లో చూపించాలని ఉన్నత న్యాయస్థానాలు పదే పదే చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశాయి.