విశాఖలో కోవిడ్ కేర్ సెంటరులో అగ్నిప్రమాదం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల విజయవాడలో రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ హోటల్ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది వరకు కరోనా రోగులు చనిపోయారు.
ఈ ఘటన మరువకముందే ఇపుడు విశాఖపట్టణంలో మరో ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి విశాఖపట్నం మారికవలస గ్రామంలోని మరో క్వారంటైన్ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ అగ్నిప్రమాదంపై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల మారికివలస శ్రీ చైతన్య జూనియర్ కళాశాల గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మూడో అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే కరోనా రోగులను పక్కనే ఉన్న మరో భవనంలోకి తరలించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేంద్రంలో మొత్తం 64 మంది కరోనా రోగులు ఉండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.