సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 ఆగస్టు 2020 (17:17 IST)

చారిత్రక ప్రాంతం విశాఖను ధ్వంసం చేస్తోంది : కేంద్రానికి వైకాపా ఎంపీ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన నరసాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రానికి ఓ లేఖ రాశారు. చారిత్రక ప్రాంతమైన విశాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేయాలని భావిస్తున్నారని అందులో పేర్కొన్నారు. పైగా, ఈ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను తక్షణం ఆపాలని ఆయన తన లేఖలో కోరారు. 
 
ఈ మేరకు ఆయన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రికి ఎంపీ రాసిన లేఖలో.. కాపులుప్పాడును చారిత్రక ప్రాంతంగా ప్రకటించాలని తెలిపారు. తొట్లకొండ బౌద్దారామం దగ్గరున్న కాపులుప్పాడును రక్షించాలని విజ్ఞప్తి చేశారు. 
 
కాపులుప్పాడులో వీఐపీ గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారని లేఖలో తెలిపారు. 1978లో తొట్లకొండను చారిత్రక ప్రదేశంగా ప్రకటించారని, బఫర్‌ జోన్‌కు 300మీటర్ల దూరాన్ని రక్షితప్రాంతంగా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పిందని లేఖలో రాశారు. 
 
కేంద్రం నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని, చారిత్రక ప్రదేశంలో నిర్మాణాలు వెంటనే ఆపాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. కాగా, విశాఖ నుంచే పాలించాలన్న దృఢ సంకల్పంతో ఉన్న జగన్ సర్కార్ ఈ మేరకు విశాఖలో పలు నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలిసిందే. 
 
కాపులుప్పాడలో క్యాపిటల్ సిటీ కోసం 250 ఎకరాలు సేకరించినట్టు సమాచారం. అందులో భాగంగా కాపులుప్పాడలో తాజాగా చేపడుతున్న నిర్మాణాలపై రఘురామరాజు స్పందించారు. చారిత్రక ప్రాంతం సమీపంలో ఉన్న కాపులుప్పాడను రక్షించాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారు.