సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 1 నవంబరు 2021 (15:56 IST)

రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డులు

వైయస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు రాష్ట్రంలో తొలిసారిగా ఇస్తున్నామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. వైయస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న గవర్నర్  బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైయస్‌.జగన్ అవార్డులు అందించారు. 
 
 
ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో గొప్పవారిని, మంచి వారిని దేశంలోని అత్యున్నత అవార్డులైన పద్మశ్రీ,  పద్మభూషణ్‌ , భారతరత్న వంటి అవార్డులిచ్చి సత్కరిస్తుంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే చేపట్టి, రాష్ట్ర అవార్డులు కూడా ఇస్తే బాగుంటుందని పలు సూచనలు ఇచ్చిన నేపధ్యంలో వైయస్సార్‌ అవార్డులను నెలకొల్పటం జరిగింద‌న్నారు.   

 
మహానేత, నాన్నగారు డాక్టర్‌ వైయస్సార్‌ గారు పేరు చెబితే అందరికీ కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచకట్టులో కనిపిస్తుంది. వ్యవసాయం మీద మమకారం తన ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గ్రామం, పల్లెల మీద పేదల మీద అభిమానం కూడా తనను చూస్తూనే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన, ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం ఇవన్నీ కూడా నాన్నగారిని చూస్తేనే కనిపించే విషయాలు.

 
భూమి మీద ఉంటూ... ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా, అంత గొప్పవాడు, మహానుభావుడు కాబట్టే ఆయన పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను ఇవ్వాలని వైఎస్సార్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు, వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇస్తున్నామని ప్రకటించాం. ఇందులో లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. అచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమొంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం అని చెప్పారు.

 
ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్ధల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంటకగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి అని వివ‌రించారు.
 
 
ఈ అవార్డులన్నీ ఇక ప్రతి ఏటా నవంబరు ఒకటో తారీఖున ఇస్తాం. రాష్ట్ర అవతరణ దినోత్సం నాడు ఈ ఆవార్డులను ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీ వాడిగా తెలుగుజాతిలో మాణిక్యాలను, మకుటాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించడాన్ని దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా అని సీఎం చెప్పారు.