శారదా పీఠానికి చెందిన 15 ఎకరాల భూమి స్వాధీనం
పెందుర్తిలో శారదా పీఠానికి గత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని ఏపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నామమాత్రపు ధరకు భూములు కేటాయించడం, కేటాయింపుల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది.
భూకేటాయింపులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విశాఖ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్ భూములను స్వాధీనం చేసుకుని ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కొత్తవలస సర్వే నెం.102/2లో 7.7 ఎకరాలు, 103లో 7.3 ఎకరాలు, మొత్తం 15 ఎకరాలు శారదా పీఠానికి ఇచ్చారు.
ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి రూ.15 కోట్ల వరకు పలుకుతోంది. ఈ లెక్కన 15 ఎకరాలు కలిపి రూ.225 కోట్ల వరకు ఉంటుంది. జగన్ ప్రభుత్వం ఆ విలువైన భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయించింది.
అంతేకాకుండా పీఠం భద్రత కోసం జగన్ ప్రభుత్వం నెలకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసేది. కొత్త ప్రభుత్వం ఇటీవల భద్రతను కూడా ఉపసంహరించుకుంది.