సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 నవంబరు 2021 (09:51 IST)

నేడు కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక : హైకోర్టు మందలింపుతో...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మందలింపుతో కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక బుధవారం జరుగనుంది. నిజానికి ఛైర్మన్ ఎన్నిక కోసం రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. కానీ, అధికార వైకాపాకి సంపూర్ణ మెజార్టీ లేకపోయినప్పటికీ ఛైర్మన్ పీఠం కోసం పోటీపడుతున్నారు. దీంతో తెదేపా సభ్యులకు గాలం వేస్తున్నారు. అయితే వారు ఏమాత్రం తలొగ్గక పోవడంతో రెండు రోజులుగా ఈ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపడుతూ వస్తుంది. 
 
ఈ క్రమంలో టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... విజయవాడ పోలీస్ కమిషనర్, కొండపల్లి మున్సిపాలిటీ కమిషనర్లను కోర్టు పిలిపించి మందలించింది. బుధవారం సాయంత్రంలోగా ఛైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో బుధవారం ఉదయం 10.30 గంటలకు మరోమారు ఎన్నిక జరిపేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. 
 
ఇదిలావుంటే, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 29 వార్డులు ఉన్నాయి. వీటిలో టీడీపీకి 15, వైకాపాకు 14 మంది కౌన్సిలర్ల బలం వుంది. అయితే, ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని (టీడీపీ), మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (వైకాపా) ఎక్స్ అఫిషియో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ ప్రకారంగా చూసినా టీడీపీ బలం 16కు, వైకాపాకు 15కి చేరుతుంది. ఈ నేపథ్యంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వ్యవహారం ఆసక్తిరంగా మారింది.