1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (13:53 IST)

ఏపీ 'స్థానిక' పంచాయతీ : తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలపై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సర్కారు ఎన్నికల నిర్వహణ ఇపుడు సాధ్యంకాదని హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈసీ జారీచేసిన షెడ్యూల్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది.
 
కానీ, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. 
 
అలాగే, కరోనా వ్యాక్సిన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించారు. 
 
ఏజీ వాదనలకు ఎస్ఈసీ తరపు న్యాయవాది బదులిచ్చేందుకు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఇవాళ ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అదేసమయంలో ఇక ఉద్యోగుల తరపున దాఖలైన అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.