శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (18:52 IST)

స్థానిక ఎన్నికలపై జగన్ సర్కారుకు హైకోర్టు డెడ్‌లైన్

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారుకు ఏపీ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. హైకోర్టు ఆర్డర్ ప్రతులు అందిన మూడు రోజుల్లోపు ముగ్గురు అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వద్దకు పంపాలని ఆదేశించింది. 
 
ఇందులో ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కలిసి స్థానిక ఎన్నికలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని విడమర్చి చెప్పాలని తెలిపింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎస్ఈసీకి తెలపాలని వివరించింది. అందుకు, మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా మూడ్రోజులు గడువు విధిస్తున్నట్టు న్యాయస్థానం తన ఆదేశాల్లో స్పష్టంచేసింది. 
 
అంతేకాదు, త్వరలోనే ఎందుకు ఎన్నికలు జరపాల్సి వస్తోందో ప్రభుత్వానికి వివరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా, ఈ చర్చలకు వేదికను ఎన్నికల సంఘం నిర్ణయించాలని సూచించింది. 
 
కాగా, గత మార్చి నెలలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇపుడు ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధమవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది.