శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (17:38 IST)

ఈ జడ్జీలు ఉన్నారే.. వైకాపా ఎమ్మెల్యే :: ప్రజలంతా కుక్కలే : ఏపీ డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మరోమారు నోరుజారారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాగా దోచుకుంటున్న నేతగా మా జగన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కలకలం రేగాయి. ఇంతలోనే ప్రజలను కుక్కలతో పోల్చారు. ప్రజలను, ప్రతిపక్షాలను కుక్కల్లా మొరగడం లేదని, విశ్వాసంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
అంతేకాకుండా గుడ్ ఫ్రైడే అల్లా పండగంటూ టంగ్ స్లిప్ అయ్యారు. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్, అల్లాకు సంబంధించి గుడ్ ఫ్రైడే నేపథ్యంలో తాను మాట్లాడానని, దానిపై కూడా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని, దానిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. జగనన్నకూడా కులాలను పట్టించుకోకుండా పేదవారికి ఇళ్ల స్థలాలు పంచిపెడుతున్నారని చెప్పారు.
 
ఇదిలావుంటే, వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈయన ప్రజలను ఉద్దేశించి చేయలేదు. సాక్షాత్ న్యాయమూర్తుల ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జడ్జీలు అవినీతికి పాల్పడుతున్నారని, ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. 
 
అసలు వీళ్లు న్యాయమూర్తులేనా? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేద కుటుంబంలో మీరు పుట్టలేదా, పేదల కష్టాలు మీకు తెలియవా? అని ప్రశ్నించారు. కోర్టులలో చంద్రబాబు చెప్పినదే కీలకంగా మారుతోందని, అలాంటప్పుడు న్యాయమూర్తి పదవికి మీరు మోసం చేసినట్టు కాదా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
 
కాగా, ఏపీలో న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల ఆ పార్టీ నేతలు కొందరు న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, కార్యకర్తలు సోషల్ మీడియాలో కోర్టులు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
 
దీనిని ఏపీ హైకోర్టు తీవ్రంగా పరిగణించడంతో సీబీఐ రంగంలోకి దిగి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.