శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (14:08 IST)

చెరువులో ఇళ్ళస్థలాలా? ఇల్లుకట్టుకుని మునిగి చావమంటారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇళ్ళపట్టాల పంపిణీ ఒకటి. ఈ పథకం క్రిస్మస్ సందర్భంగా ప్రారంభమైంది. అయితే, పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, అధికారులకు వింత అనుభవం ఎదురైంది. అనేక గ్రామాల్లో నివాసానికి ఏమాత్రం పనికిరాని చోట్ల ఇళ్ళపట్టాలు ఇచ్చారు. ఇలాంటి చోట్ల అనేక మంది లబ్ధిదారులు ఇళ్ళపట్టాలను తీసుకున్నారు. ఒకవేళ ఒకరిద్దరు తీసుకున్నారు.. నివాసయోగ్యంగాని ప్రాంతాల్లో ఇల్లు ఎలా కట్టుకోవాలంటూ అధికారులను నిలదీసి తిరిగి ఇచ్చేశారు. 
 
ఈ ఘటన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలకు వింత అనుభవం ఎదురైంది. శనివారం యాడికి మండల కేంద్రంలో నాగమ్మ అనే లబ్ధిదారుకు పట్టా ఇచ్చిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి... 'ఈ పట్టా ఎవరిచ్చారమ్మా?' అని అడిగారు. 'చంద్రన్న సారు పట్టా ఇచ్చార'ని ఆమె చెప్పటంతో ఆయనతో పాటు అక్కడున్న వైసీపీ నాయకులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
జగనన్న ఇచ్చారని పార్టీ శ్రేణులు చెప్పమనడంతో నాగమ్మను ఎమ్మెల్యే రెండోసారి ప్రశ్నించారు. జగనన్న ఇచ్చాడని ఆమె బదులిచ్చింది. కదిరి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నారు. పట్టా ఎవరిచ్చారని కొందరు లబ్ధిదారులను ఎమ్మెల్యే అడగ్గా.. చంద్రన్న ఇచ్చాడంటూ చెప్పటంతో అధికార పార్టీ నేతలు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. 
 
మరోవైపు, నివాసయోగ్యం కాని చెరువులో స్థలాలిస్తే, ఇల్లు కట్టుకొని మునిగిపోవాలా అంటూ అధికారులను లబ్ధిదారులు నిలదీశారు. మీ పట్టాలొద్దు.. ఏమొద్దంటూ నిరసన వ్యక్తం చేస్తూ వాటిని వెనక్కిచ్చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం అరమలకవారిపల్లిలో చోటుచేసుకుంది.
 
ఇదిలావుంటే, కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. మైలవరం మండలం, పొందుగల గ్రామంలో పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు, క్యాలండర్లు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. అర్హులైన తమకు ఇళ్ల పట్టాలు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా.. అనర్హులకు ఇచ్చారంటూ వైసీపీ కార్యకర్తలు నేతలపై మండిపడ్డారు. అంతేకాదు.. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే వంసత కృష్ణప్రసాద్ పంపిణీ చేసిన గడియారాలను పగులగొట్టారు. ఓట్ల కోసం తమ ఇళ్లకు నేతలు ఎలా వస్తారో చూస్తామంటూ హెచ్చరించారు.