సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (11:00 IST)

చెలరేగిపోయిన హిజ్రాలు... యజమానిని బెదిరించి నగదు దోపిడి!

హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో హిజ్రాలు చెలరేగిపోయాయి. ఓ ఇంట్లోకి మూకుమ్మడిగా ప్రవేశించి యజమానిని బెదిరించి రూ.20 వేలు డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ప్రగతి నగర్‌లోని ఓ ఇంట్లో నూతన దంపతులతో కుటుంబ సభ్యులు వ్రతం చేయిస్తున్నారు.
 
ఈ విషయం తెలిసి ఇంట్లోకి ప్రవేశించిన 10 మంది హిజ్రాలు నానా రభస చేశారు. తమకు రూ.20 వేలు ఇస్తేనే అక్కడి నుంచి వెళ్తామని డిమాండ్ చేశారు. ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించడంతో అసభ్యంగా ప్రవర్తించారు. అర్థనగ్న ప్రదర్శన చేశారు. వికృత చేష్టలతో భయపెట్టారు. పెద్దగా అరుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. 
 
వారి అసభ్య చేష్టలకు భరించలేని ఇంటి యజమాని చలపతి చివరికి రూ.16,500 ఇవ్వడంతో తీసుకుని వెళ్లారు. అనంతరం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రూ.16,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.