శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (16:36 IST)

ఎన్నికల్లో వైకాపా నేతలకు లాగు తడిసిపోతాద్ది : తెదేపా

ఏపీలో స్థానికసంస్థల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపింది. ఈ ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని వైకాపా నేతలు కోరుతున్నారు. కానీ, ఈసీ మాత్రం ముందుకు సాగుతోంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. రాష్ట్రంలో పరిణామాలపై గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ జోక్యం చేసుకోవాలని కోరారు. 
 
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ అధికారం ఈసీదేనని తెల్చిచెప్పారు. పంచాయతీ ఎన్నికలకు ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరేనని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సహకరించమని మంత్రులు చెప్పడం దేశ చరిత్రలో లేదన్నారు. స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం సీఎం జగన్‌కు లేదన్నారు. మద్యం షాపుల నిర్వహణకు లేని అభ్యంతరాలు ఎన్నికలకు ఉంటాయా అని యనమల రామకృష్ణ  ప్రశ్నించారు.
 
అలాగే, స్థానిక ఎన్నికలకు వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని అనుచరుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విచ్చలవిడిగా పేకాట శిబిరాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం వీటిని అడ్డుకోవడంలో విఫలం అయిందన్నారు.  ప్రజా సంక్షేమాన్ని సీఎం జగన్ విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కొల్లు రవీంద్ర కోరారు.
 
కరోనా దృష్ట్యా  స్థానిక ఎన్నికలకు సహకరించలేమని ఉద్యోగులు ఎలా చెపుతారని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికలను వైసీపీ నాయకులు, ఉద్యోగులు ఎందుకు ఆపాలని ఎందుకనుకుంటున్నారని నిలదీశారు. నాలుగు నెలలుగా ఇళ్ల పట్టాల పంపిణీలో ఉద్యోగులు పాల్గొనలేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఉద్యోగులకు లేని ఆరోగ్య భద్రత స్థానిక ఎన్నికల నగానే గుర్తుకు వచ్చాయా అని బండారు సత్యనారాయణ నిలదీశారు.