సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (17:31 IST)

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు : హైకోర్టు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఆదేశాలు ఏపీ సర్కారుకు ఊరట కలిగించేలా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌కు అంతరాయం కలగరాదనీ, ప్రజాసంక్షేమం దృష్ట్యా వీటిని నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఇటీవల ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డొస్తాయని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేశామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
 
విచారణ సందర్భంగా ఎస్ఈసీ నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, స్థానిక ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం కష్టసాధ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ రిలీజ్ చేశారు.