సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (07:46 IST)

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు, తెలంగాణాలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. అయితే, వచ్చే 24 గంటల్లో ఈ వాయుగుండం బలహీనపడే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 
 
ప్రస్తుతం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఉత్తరాంధ్రలో సోమవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బలహీనపడుతుందని వెల్లడించింది. 
 
అటు, వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 12న నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఆ తర్వాత సెప్టెంబరు 13, 14, 15 తేదీల్లో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.