శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (15:30 IST)

స్వరూపానంద బర్త్‌డే .. ఆలయాల్లో ప్రత్యేక పూజలు అక్కర్లేదు.. ఏపీకి హైకోర్టు షాక్

శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి పుట్టిన రోజైన నవంబరు 18వ తేదీని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల నుంచి కానుకలు, ప్రసాదాలు అందజేయాలంటూ ఏపీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ జారీచేసిన మెమోపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం జారీచేసిన మెమోను కొట్టివేసింది. 
 
కాగా, స్వరూపానందస్వామి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలంటూ దేవాదాయశాఖ నుంచి దేవాలయాలు అన్నింటికి ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా, శ్రీకాకుళం అరసవల్లి నుంచి చిత్తూరు కాళహస్తి వరకు అన్ని దేవాలయాల్లోనూ ఈ పూజలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. 
 
అయితే చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఈ విషయంపై పిటిషన్ వేయగా.. విచారించిన న్యాయస్థానం ఇరువైపు వాదనలు విన్న అనంతరం మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అడిగినమీదట తాము కూడా తమ లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు స్వరూపానందస్వామి శారదాపీఠం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో హైకోర్టు కేసును మూసివేసింది.
 
పుట్టిన రోజు వేడుకలపై రచ్చ ఇదే...
ఈ నెల 18వ తేదీన అంటే నవంబరు 18 బుధవారం విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానేందేంద్ర సరస్వతి పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని శారదాపీఠం నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, అర్చకులు, అధికారులతో సహా వచ్చి స్వరూపానందకు ప్రసాదాలు, ఆలయ స్థాయికి తగిన మర్యాదతో కానుకలు సమర్పించుకుని వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 
 
ఈ మేరకు రాష్ట్రంలోని 23 ప్రముఖ ఆలయాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. టీవీ, పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు శారదాపీఠం స్పందించి ఓ ప్రకటన రూపంలో వివరణ ఇచ్చుకుంది.
 
'సనాతన హైందవ ధర్మ పరిరక్షణే విశాఖ శ్రీ శారదాపీఠం ముఖ్య ప్రాధాన్యత. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చేయడానికి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానేందేంద్ర సరస్వతి మహాస్వామి చేస్తున్న కృషి విదితమే. గత మూడ్రోజులుగా మహాస్వామి వారి జన్మ దినోత్సవ వేడుకలపై అసత్యప్రచారం, అనవసర రాద్ధాంతం జరుగుతోంది. 
 
మహాస్వామి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జన్మదిన మహోత్సవం రోజున ఆలయ మర్యాదలు కోరాం. 2004 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆలయాల నుంచి మహాస్వామి వారికి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సాంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని విశాఖ శ్రీ శారదాపీఠం కోరడమైనది. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తాం' అని శారదాపీఠం ఓ ప్రకటనలో పేర్కొంది.