విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... రూ.300 కోట్ల ఆస్తి నష్టం
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అసలే నష్టాల్లో ఊబిలో కొట్టుమిట్టాడుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా రూ.300 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఈ విషయం తాజాగా వెల్లడైంది.
విద్యుత్తు కేబుళ్లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)-2లో మంటలు చెలరేగాయి. వాటిని సకాలంలో అదుపు చేయలేకపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. అవగాహన లేకుండా తాళాలు వేయాల్సిన చోట వెల్డింగ్ చేయడంతో అవి తెరవడానికి కుదరకపోవడంతో అత్యంత శక్తిమంతమైన కేబుళ్లు కాలిపోయాయి. వాటిని పునరుద్ధరించాలంటే మొదటి నుంచీ మళ్లీ పని చేపట్టాల్సి ఉంటుందని, అందుకు రూ.300 కోట్ల వ్యయంతోపాటు మూడు నెలల సమయం పడుతుందని ప్లాంట్ ఇంజనీర్లు చెబుతున్నారు.
మరోవైపు, స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల రెండో బ్లాస్ట్ ఫర్నేస్‌ను పునఃప్రారంభించారు. దీనివల్ల అదనపు ఉత్పత్తి జరుగుతుందని భావించారు. ఇప్పుడు దీనికి ప్రమాదం వాటిల్లింది దీనికి సంబంధించిన ఎస్ఎంఎస్‌లోనే కావడంతో అదనపు ఉత్పత్తి ఆశ నీరుగారిపోయింది. ప్రమాద సమయంలో సైరన్ గంటన్నరపాటు మోగినా తీవ్రత తెలియకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వల్ల కేబుళ్లు మొత్తం కాలిపోయాయి. ఫలితంగా ఎల్సీ కన్వర్టర్లు పనిచేయడం మానేశాయి.
ఎస్ఎంఎస్-2లో ఉన్న మూడు ఎలీ కన్వర్టర్లలో మూడింటిలో ఒకదానిని పది రోజులు కష్టపడి ఒకదానిని ప్రారంభించారు. రెండో దానిని మరో రెండు వారాల్లో అందుబాటులోకి తెస్తామని చెబుతున్నా, మూడో దానిని పరిస్థితి ఏమిటో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎస్ఎంఎస్-1లో మూడు కన్వర్టర్ల ద్వారా రోజుకు దాదాపు 10 వేల టన్నులు, 2 ద్వారా ఆరు వేల టన్నులు ఉత్పత్తి చేయాలని భావించారు. ఇప్పుడు ఒక్కటే పని చేస్తుండడంతో రోజుకు 2 వేల టన్నులకు మించి ఉత్పత్తి కష్టమని చెబుతున్నారు.