గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (10:48 IST)

చంద్రబాబు తరుపున నేను క్షమాపణ కోరుతున్నా: దివ్యవాణి

రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది క్రైస్తవులు తిరిగి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని అభిలషిస్తున్నారని, అనేకమంది పలు సందర్భాల్లో నా ఎదుట అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని, టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి తెలిపారు.

ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగానే వ్వవహ రిస్తారని, ఆయన వ్యాఖ్యలు కూడా అలానేఉంటాయని,  క్రైస్తవ సమాజానికి, దళితులకు ఎవరూచేయని మేలు, సంక్షేమ పథకాల ను ఆయన అమలుచేశాడనడంలో ఎటువంటి సందేహం లేదని దివ్యవాణి స్పష్టంచేశారు.

చంద్రబాబు వ్యాఖ్యలపై క్రైస్తవులు ఎవరూ కలవరపడాల్సిన పనిలేదన్న ఆమె, రాజ్యాంగ విధానాన్ని, బైబిల్ విధానాన్ని క్షుణ్ణంగాపరిశీలిస్తే, ఎవరికైనాసరే ఆయన వ్యాఖ్యల్లో తప్పుకనిపించదన్నారు. రాజకీయాలను, పౌరుషాలను పక్కనపెట్టి, వాస్తవాలగురించి ఆలోచించాలన్నారు. ఏనాడూ అనని మాటలను చంద్రబాబునాయుడు ఎందుకు అన్నారో, ఎటువంటి పరిస్థితుల్లో అన్నారో కూడా ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. పరిపాలనలో, ఆలోచనా ధృక్పథంలో  ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవడం అంత తేలిగ్గా అందరికీ అర్థం కాదన్నారు. 

బైబిల్ ను వ్యాపారంగా మార్చిన కొందరు వ్యక్తుల దురాలోచనలను కట్టడి చేయాల్సిన సమయం వచ్చిందనే నిజాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలని చంద్రబాబునాయుడు సూచించడం జరిగిందన్నారు. అన్నివర్గాలు, కులాలు, మతాలను తాను సమానంగా చూశానని, అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం పక్షపాతం లేకుండా ఎందుకు పనిచేయదని మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న పాలకులను నిలదీయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ సొమ్ముని ఒక మతానికే వినియోగించడం, ఆ మతాన్ని అనుసరించేవారికే ఖర్చుచేయడం, ఒక కంట్లో బెల్లం, మరో కంట్లో సున్నం పెట్టేలా పాలకులు పక్షపాతంగా వ్యవహరించవద్దని మాత్రమే ఆయన కోరడం జరిగిందని దివ్యవాణి వివరించారు 

అనేకమంది క్రైస్తవపెద్దలు, తాను టీడీపీలో ఉండటాన్ని తప్పుపట్టారని, చంద్రబాబునాయుడి ఆలోచనలు అర్థంచేసుకున్న వారెవరైనా సరే, అలా మాట్లాడరన్నారు. తాడేపల్లిగూడెంలో చర్చిపై దాడి జరిగి న సందర్భంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఘటనాస్థలాన్ని సందర్శించి, న్యాయంచేసే వరకు అక్కడే ఉండటం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో హిందూమతంపై, దేవాలయాలపై 150 వరకు ఘటనలు జరిగినా, మంత్రులు అవహేళనగా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి ఏంచేస్తున్నారని చంద్రబా బు ప్రశ్నించడం జరిగిందన్నారు.

తొలి ఘటన జరిగినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే, 150వ ఘటన జరిగేది కాదుకదా అనే సందర్భాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి ముగ్గురూ ఒకే మతానికిచెందిన వారు అయినప్పుడు, హిందూ మతంపై జరుగుతున్న దాడుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యతవారిపై ఉంది కదా అని ఆయన గుర్తుచేయడం జరిగిందన్నారు. ఆయన బైబిల్ విధానంలో మాట్లాడకపోయినా, రాజ్యాంగ విధానంలో మాట్లాడారనే వాస్తవాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తెరగాలన్నారు.

తనముందు నిలబడే అర్హత లేనివారి ని కూడా గౌరవించి, వారి ఆలోచనలు స్వీకరించే గొప్ప మనస్తత్వం చంద్రబాబుకు మాత్రమే ఉందని దివ్యవాణి తేల్చిచెప్పారు. దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఎవరు పనిచేస్తున్నారో ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. ఎవరికీ సాష్టాంగ పడకూడదని ప్రభువు చెబుతుంటే, అందుకు విరుద్ధంగా స్వామీజీల కాళ్లపై ఎవరు పడ్డారో ప్రజలు గ్రహించాలన్నారు. తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు అబ్దుల్ కలాం వంటి గొప్పవ్యక్తే, డిక్లరేషన్ ఇచ్చాక స్వామివారిని దర్శించుకున్నాడన్నారు.

క్రీస్తుబిడ్డనని చెప్పుకునే వ్యక్తి, ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమో, అధికారాన్ని కాపాడుకోవడానికి, తనపై ఉన్న కేసులను కొట్టేయిం చుకోవడానికి ఏ ఎండకు ఆగొడుగు పట్టే రకం ఎవరో వారే ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబునాయుడు బాప్టిజం తీసుకోలేదని, అలా అని ఆయన అన్యమతాలను కించపరిచిన దాఖలాలు కూడా లేవన్నారు. 

కొడాలి నాని వంటివారు మంత్రులుగా రాష్ట్రానికి లభించినందుకు అనేకమంది చెప్పలేని ఆనందంతో ఉన్నారని దివ్యవాణి ఎద్దేవాచేశారు. చంద్రబాబునాయుడు కీర్తనలు పాడలేదా అని ఆయన ప్రశ్నించడం సదరు వ్యక్తిలోని అపరిపక్వతకు నిదర్శనమన్నారు. రాష్ట్ర నాయకుడి హోదాలోక్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నప్పుడు, కీర్తనలు పాడటం, రంజాన్ సమయంలో నమాజు చేయడం వంటివి సర్వ సాధారణ విషయాలనే జ్ఞానం నానీకి లేకపోవడం బాధాకరమన్నారు.

టీడీపీ ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగానే ఉన్నారని, ఎక్కడా ఎవరి మధ్యనా మతపరమైన వైరుధ్యాలు తలెత్తిన దాఖలాలు లేవన్నారు. లోపల రాజకీయాలు చేస్తూ, పైకి మాత్రం నవ్వుతూ కనిపించడం, మతాన్ని అడ్డుపెట్టుకొని తనపై ఉన్న నిందలను కప్పిపుచ్చుకుంటూ, ప్రజలపై చాపకింద నీరులా దొంగప్రేమ నటిస్తున్నవారు పాలకులుగా ఉండబట్టే, రాష్ట్రంలో ఇన్ని అనర్థాలకు కారణమన్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, హిందూమతంపై జరిగిన ఘటనలే, క్రైస్తవమతంపై జరిగి ఉంటే, ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాడన్నారు. అబద్ధాలతో, అనుమానాలతో చంద్రబాబునాయుడి వంటి మంచినాయకుడిపై అసూయ, కక్ష పెంచుకోవడం ఎంతమాత్రం తగదన్నారు. చంద్రబాబునాయుడు ఈ లోకంలో పదవులు కోరుకునే వ్యక్తి కాదని, రెండుసార్లు ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా తిరస్కరించి, ప్రజలకోసం అనేక దూషణలు, భూషణలు భరించాడన్నారు.

అటువంటి వ్యక్తి ఒక వర్గానికి, ఒక మతానికి కొమ్ముకాసేలా మాట్లాడరనే నిజాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు గ్రహించాలన్నారు. అమరావతి ఉద్యమంలో ఉన్న క్రైస్తవులు, డాక్టర్ సుధాకర్, అతని తల్లి క్రైస్తవులనే నిజం ముఖ్యమంత్రికి తెలియదా అని దివ్యవాణి ప్రశ్నించారు.

మతోన్మాదంతో పనిచేస్తున్న వ్యక్తి ఎవరో, మతసామరస్యం కోసం నిలిచేది ఎవరో ప్రజలు గ్రహించాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు నిజంగా ఎవరి మనసునైనా కష్టపెట్టి ఉంటే, ఆయన తరుపున తాను క్షమాపణ కోరుతున్నానని, మనస్పూర్తిగా ప్రతి ఒక్కరూ తనను క్షమించాలని దివ్యవాణి విన్నవించారు.