సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:57 IST)

చర్చిపై దాడి జరిగివుంటే గ్లోబల్ న్యూస్ అయ్యేది... హిందువులు మనుషులు కారా : పవన్ కళ్యాణ్ ప్రశ్న

pawan kalyan
ఒక చర్చిపై జరిగివుంటే అది గ్లోబల్ న్యూస్ అయ్యేదని, హిందువులు మనుషులు కారా, వారికి మనోభావాలు లేవా అంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్రమైన నెయ్యిని ఉపయోగించి తయారు చేసినట్టు తేలింది. దీనికి ప్రాయశ్చిత్తదీక్షను ఆయన చేపట్టారు. నంబూరులోని దశావతార శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన దీక్ష ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తిరుమలలో దాదాపు 300 సంవత్సరాలుగా నైవేద్యంగా ఇస్తున్న మహాప్రసాదం లడ్డూను అపచారం చేయడం దురదృష్టకరం. వైసీపీ పాలనలో 2019 - 2024 వరకు టీటీడీ బోర్డును నిర్వహించిన తీరు సరిగ్గా లేదు. వైసీపీ హయంలో టీటీడీ బోర్డు స్వామివారి సేవలను మార్చేసారు, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక్కొక్కరి దగ్గర 10 వేలు వసూలు చేశారు. బిల్లు మాత్రం 500 మాత్రమే ఇచ్చేవారు. దీనిపై గతంలో ఎన్నోసార్లు మాట్లాడాను, కానీ ఏనాడు వైసీపీ పట్టించుకోలేదు. వైసీపీ పాలనలో 219 గుడులను /విగ్రహాలను ధ్వంసం చేసి అపవిత్రం చేశారు. ఎన్నోసార్లు వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలపై నేను ప్రశ్నించి మాట్లాడాను. 
 
రామతీర్థంలో రాముల వారి విగ్రహం తలను పగలగొట్టిన అర్చకులు విగ్రహం పట్టుకుని ఏడుస్తున్న ఘటన ఎంతో కదిలించింది. ఆరోజు నేను అన్ని మతాల వారు ఖండించాలని పిలుపునిచ్చాను, చిలకలూరిపేట ముస్లిం కుటుంబం కూడా ఖండించి మతాలకు అతీతంగా నిలబడ్డారు. తితిదేలో జరిగిన అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలపై విచారణ జరగాల్సింది. ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ వారు ఇచ్చిన రిపోర్టులో శ్రీవారి ఆలయంలో లడ్డూ మహాప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె, ఇతర నూనెలు వాడినట్లు తెలిసింది. ఇది చాలా ఘోరమైన దారుణం. 
 
శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి జంతు కొవ్వు, చేప నూనెతో చేసిన లక్ష లడ్డూలు గత వైసీపీ ప్రభుత్వం టీటీడి నుండి పంపించడం దారుణమైన చర్య. గతంలో వైసీపీ హయంలో రామతీర్థం రాముల వారి విగ్రహం తల పగలగొట్టిన ఘటన సమయంలో నేను అది తప్పు, అందరూ ఖండించాలి అని పిలుపునిచ్చాను తప్ప రాజకీయంగా వాడుకోవాలని చూడలేదు, కానీ మీరు నిందితులను పట్టుకోలేకపోయారు. ఇప్పుడు తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలపడం అనేది నీచమైన చర్య, ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి ఖండించి పోరాడాల్సిన అవసరం ఉంది. నా మీద వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు నేను స్పందించలేదు, కానీ తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన ఘటన విషయంలో మాత్రం ఖచ్చితంగా స్పందిస్తాను, తప్పు చేసిన వారిపై చర్యలు ఉంటాయి అని తెలియజేస్తున్నాను. 
 
గత టీటీడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడి ఈవోగా ధర్మారెడ్డి, ఇతర పాలకులపై, కార్యవర్గంపై విచారణ జరగాలి, తప్పు ఎవరు చేశారో బయటకు తీయాలి. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు, కానీ తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించే ప్రభుత్వం. తిరుమలలో జరిగిన విధంగా ఏ ధర్మంపై దాడి జరిగిన సరే గ్లోబల్ వార్త అవుతుంది, ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది, ప్రతీ ఒక్కరూ మాట్లాడుతారు, కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు ప్రసాదం అపవిత్రం అవుతుంటే మాత్రం ఎవరు మాట్లాడకూడదా? మీరు సెక్యులర్ మాట్లాడకూడదు అంటే ఎలా? హిందువులకు మనోభావాలు ఉండవా? హిందువులపై దాడి జరిగితే చూస్తూ కూర్చోవాలా? నేను అన్ని మతాలను గౌరవించేవాడిని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇతర అన్ని మతాలను గౌరవించే వాడిని, సనాతన ధర్మం అని మాట్లాడేవాడిని, సనాతన ధర్మం అంటే అన్ని మతాలను సమానంగా చూస్తూ, మన మతాన్ని ఆచరించడం. 
 
టీటీడీ బోర్డు ఉన్నది ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమే... టిక్కెట్లు అమ్ముకోడానికో, మీ ఇష్టానికి కాంట్రాక్టులు చేసుకోడానికి బోర్డులో ఉండటం కాదు. టీటీడీ బోర్డులో తప్పులు చేస్తూ, తిరుమల స్వామి వారిని అపవిత్రం చేస్తాం, మీరు మాట్లాడకూడదు అంటే కుదరదు, ఖచ్చితంగా కోపాలు వస్తాయి, మేము మాట్లాడతాం, గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తాం, ఖండిస్తాం, చర్యలు తీసుకుంటాం. గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సూటి ప్రశ్న అడుగుతున్నాను, తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటావా? 
 
మరి తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదు అంటున్నారు? మేము మాట్లాడతాం, మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం, సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడుతాను. తిరుమల ఘటనలో దోషులకు శిక్ష పడాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తున్నాను, గత ప్రభుత్వ హయంలో టీటీడీలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, అపచారాలపై విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి. 
 
తితిదేలో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులు, స్వామి వారి భక్తులు, అక్కడ తప్పు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు? వైసీపీ నాయకులకు భయపడ్డారా? మీరు ప్రశ్నించాలి కదా, స్వామి వారికి దారుణం జరగకుండా చూడాలి కదా. కోట్లాది మంది శ్రీవారిని నమ్మే భక్తులను తిరుమల లడ్డూ కల్తీ ఘటన ఆవేదనకు గురిచేసింది, ఇది హిందూ ధర్మంపై జరిగిన దాడిగా భావిస్తున్నాను, దీనిని అందరూ మతాలకు అతీతంగా ఖండించాలి. ఆశ్రయం ఇచ్చిన స్వామి వారికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకపోవడం టీటీడీలో పనిచేస్తున్న హిందువులు చేసిన తప్పు. హిందువులు అందరికీ పిలుపునిస్తున్నాను. 
 
ముందు మీరు హిందూ మతాన్ని గౌరవించండి, మీ మతాన్ని గౌరవించడం ప్రతీ హిందువు నేర్చుకోవాలి, తప్పులను ఖండించాలి, బయటకు వచ్చి పోరాడాలి, నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై తిరుమల లడ్డూపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయి. తాను ఎన్నో సమస్యలపై వైసీపీతో పోరాడాను, రోడ్ల గురించి, రైతుల గురించి మాట్లాడాను, జరిగిన తప్పుతో నాకు సంబంధం లేకపోయినా సరే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను. తిరుమలలో తప్పు జరిగిందని తెలిసి కూడా మాట్లాడకపోతే టీటీడీ ఉద్యోగులు తప్పు చేసినట్లు అవుతుంది.