శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 నవంబరు 2024 (09:29 IST)

దేశంలో అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు : ఇండియా టుడే సర్వే

Chandrababu
దేశంలో అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ మేరకు ఇండియా టుడే నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. అలాగే, దేశ వ్యాప్తంగా టాప్-10 నేతల్లో ఆయన ఐదో స్థానంలో నిలిచారు. చంద్రబాబు కంటే ముందు తొలి నాలుగు స్థానాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఉన్నారు. 
 
ఇకపోతే, దేశంలోని అత్యంతశక్తిమంత ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌లు ఉన్నారు. 
 
కాగా, చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం ద్వారా రాజకీయంగా ఎదురైన అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్ పక్షిలా పునర్జన్మ ఎత్తి.. అధికారం చేజిక్కించుకున్నారని 'ఇండియా టుడే' కథనం అభివర్ణించింది. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో మాత్రమే ఇలాంటి చరిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని ప్రశంసించింది. ప్రస్తుతం ఆయన భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని పేర్కొంది.
 
అలాగే జనసేన, బీజేపీతో కూటమిగా ఏర్పడి టీడీపీని పతనావస్థ నుంచి విజయతీరానికి చేర్చారని మంగళవారం నాటి తన ప్రత్యేక కథనంలో చంద్రబాబుకు ‘ఇండియా టుడే’ కితాబిచ్చింది. ఇపుడు చంద్రబాబు దేశంలోనే అత్యంత సీనియర్ సీఎం అని తెలిపింది.
 
'ప్రస్తుతం కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంకటం తప్పదు. అందుకే పాలక ఎన్డీఏలో ఆయన కీలకం అయ్యారు. నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చాలా ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. 
 
ఇందుకోసం ఇటీవలే విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. 15 శాతం వృద్ధి రేటుతో 2047 కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు. ఇక కార్పొరేట్లతో స్నేహభావంతో మెలిగే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఏర్పాటుకు చొరవ చూపించారు" అని 'ఇండియా టుడే' తన కథనంలో రాసుకొచ్చింది.