శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (10:49 IST)

ఆగస్టు నుంచి ఇంటర్ కాలేజీలు... పండగ సెలవలు కుదింపు : ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఆగస్టు మూడో తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఆగస్టు మూడో తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభించాలని ఆదేశించారు. అయితే, కొత్త విద్యా సంవత్సరంలో పని దినాలు 196గా ఖరారు చేశారు. అలాగే, 30 శాతం సిలబస్‌ను తగ్గించారు. ఈ మేరకు 2021 అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసిన ఉన్నత విద్యా శాఖ, సీబీఎస్ఈ తరహాలో పాఠ్యాంశాలను 30 శాతం తగ్గించాలని పేర్కొంది.
 
ఇక ఉదయం సైన్స్, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహించాలని, రెండో శనివారం కూడా కాలేజీలను నడిపించాలని, పండగల సందర్భంగా ఒకటి లేదా రెండు రోజుల సెలవు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. 
 
విద్యార్థులకు యూనిట్ పరీక్షలు నిర్వహించాలని, ఆన్‌లైన్ పాఠాల నిమిత్తం వీడియోలను రూపొందించి విడుదల చేస్తామని వెల్లడించింది. యధావిధిగా మార్చిలోనే వార్షిక పరీక్షలు ఉంటాయని విద్యా శాఖ స్పష్టం చేసింది. 
 
ఇక ప్రతి సబ్జెక్టుకూ ఒక వర్క్ బుక్‌ను ప్రత్యేకంగా ఇవ్వనున్నామని, జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలకు అనుగుణంగా ఈ వర్క్‌బుక్ ఉంటుందని ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, చిత్తూరు, కృష్ణ, ప్రకాశం, ఈస్ట్ గోదావరి, గుంటూరు, వైజాగ్ జిల్లాల్లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉంది. అదేసమయంలో కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఆగస్టులో ఇంటర్ కాలేజీలను తెరవాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.