ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

ఏపీ సీఎంవోలో సునామీ? : అజేయ కల్లాం, పీవీ రమేశ్‌ శాఖలు కట్‌!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్నమొన్నటివరకు చక్రం తిప్పిన సలహాదారుల అధికారాలను ఇపుడు పూర్తిగా కత్తిరించేశారు. ముఖ్యంగా, ఇప్పటివరకు సీఎంవోలో కీలక బాధ్యతలను నిర్వహించిన అజేయ కల్లాం, పీవీ రమేశ్, జే.మురళిని తప్పించారు. వీరి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాశ్, సాల్మన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయించారు. 
 
ప్రవీణ్ ప్రకాశ్‌కు జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయశాఖ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్ బోర్డు బాధ్యతలను ఇచ్చారు. అలాగే, సాల్మన్ ఆరోఖ్య రాజ్ పరిధిలో ఆర్ అండ్ బీ, రవాణ, పౌర సరఫరాలు, గృహ నిర్మాణం, విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, సంక్షేమం, పీఆర్, ఆర్టీసీ, పెట్టుబడులు, కార్మికశాఖ, గనులు, ఐటీ ఉన్నాయి. 
 
ధనుంజయ్ రెడ్డికి మున్సిపల్, అటవీ, వైద్యారోగ్యం, జలవనరులు, టూరిజం, మార్కెటింగ్, ఇంధనం శాఖలను అప్పజెప్పారు. ఇప్పటి వరకు సీఎంవోలో చక్రం తిప్పిన అధికారులను పక్కనపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
 
నిజానికి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ, సీఎం అయిన తర్వాత అజేయ కల్లాం సూపర్ బాస్‌లా ఉన్నారు. సీఎంవోలో ఆయనకు ఎదురు లేకుండా ఉన్నది. అధికారులకు ఆయన మాటే శాసనం. అంతటి స్థాయిలో చక్రం తిప్పిన అజేయ కల్లాంను ఇపుడు ఉన్నట్టుండి పక్కనబెట్టడం చర్చనీయాంశంగా మారింది. పైగా, ఈయన నిర్వహిస్తూ వచ్చిన కీలక శాఖలను సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌కు అప్పగించడం అఖిల భారత సర్వీసు వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
వైసీపీ అధికారం చేపట్టిన నాటినుంచి ఓ వెలుగు వెలిగిన సీఎంవో ప్రధాన సలహాదారు అయిన కల్లం ఇప్పుడు శాఖల్లేని సలహాదారు పాత్రకు పరిమితమైపోయారు. ఆయనతో పాటు మరో సలహాదారు పీవీ రమేశ్‌ను కూడా గతంలో కేటాయించిన శాఖల నుంచి తప్పించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు అనునిత్యం సలహాలిచ్చారు. సీఎం అయిన తర్వాత కూడా వీరిద్దరూ చక్రం తిప్పుతూ వచ్చారు. కానీ, ఇపుడు ఉన్నట్టుండి వీరిద్దరి శాఖలను కత్తిరించి, ఎలాంటి శాఖలు లేని సలహాదారులుగా నియమించడం వెనుక ఆంతర్యమేంటని ప్రభుత్వ వర్గాలే చర్చించుకుంటున్నాయి.