శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్

22న జగన్ మంత్రివర్గం విస్తరణ : అంబటి - రోజా - ధర్మానలకు ఛాన్స్???

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈ నెల 22వ తేదీన విస్తరించనున్నారు. ఇందులో ఒకరిద్దరు మంత్రులు తమ మంత్రిపదవులు కోల్పోయే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, కొత్తగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, మంత్రిపదవులకు గట్టిగా పోటీపడుతున్న వారిలో పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే. రోజా, ధర్మాన ప్రసాద రావు, జోగి రమేష్‌లు ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. 
 
నిజానికి మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు ఇటీవల రాజ్యసభకు ఎంపికయ్యారు. దీంతో వారిద్దరూ తమ మంత్రిపదవులకు రాజీనామా చేశారు. ఫలితంగా రెండు మంత్రిపదవులు ఖాళీ అయ్యాయి. వీటిని ఈ నెల 22వ తేదీన చేపట్టే మంత్రివర్గ విస్తరణలో భర్తీ చేసేందుకు సీఎం జగన్ కసరత్తు చేసినట్టు సమాచారం. 
 
ఈ రెండు మంత్రిపదవులకు పోటీపడుతున్నవారిలో శ్రీకాంత్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే. రోజా, ధర్మాన ప్రసాద రావు, జోగి రమేష్‌లతో పాటు రామచంద్రాపురం ఎమ్మెల్యే సి. వేణు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌లతో పాటు.. విపక్షలపై విరుచుకుపడుతున్న గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్‌లు ముందువరుసలో ఉన్నారు. వీరిలో ధర్మాన ప్రసాద రావు ఉప ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో ఇద్దరు తమ పదవులను కోల్పోయే ఆస్కారం ఉన్నట్టు తాడేపల్లి వర్గాల సమాచారం.