గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (09:57 IST)

కనగరాజ్‌ను ఖంగు తినిపించిన జగన్

కరోనా కల్లోల సమయంలో సైతం సరిహద్దు మూసివేతను దాటి, ఆయనను తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించారే? ఆ జస్టిస్ కనగరాజ్‌ను ఇప్పుడు ఏపీ సర్కారు ఖంగుతినిపించింది. కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం జగన్ ప్రభుత్వం పంపిన ముగ్గురు పేర్లలో, ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
నిమ్మగడ్డ రమేష్‌ను ఎస్‌ఈసీగా తొలగించి, ఆయన స్ధానంలో తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ను జగన్ ప్రభుత్వం నియమించింది. ఆ సందర్భంలో ప్రభుత్వం తన నియామకాన్ని సమర్ధించుకునేందుకు నిబంధనలు మార్చింది. చివరకు జగన్ సైతం ‘రిటైర్డ్ ఏఐఎస్, ఐపిఎస్‌లు రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు కాబట్టి వారిలో పారదర్శకత ప్రశ్నార్ధకంగా మారుతుంది. అందుకే రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా నియమిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
 
తాజాగా నిమ్మగడ్డ పదవీకాలం ఈనెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఎస్‌ఈసీ ఎంపిక కోసం ప్రభుత్వం నీలం సహానీ, ప్రేంచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లు గవర్నర్ పరిశీలనకు పంపించారు. అయితే వారిలో,  గతంలో ప్రభుత్వం తానే  చొరవ తీసుకుని తీసుకువచ్చిన కనగరాజ్ పేరు లేకపోవడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. ఎందుకంటే ఆ ముగ్గురిలో ఎవరూ రిటైర్డ్ జడ్జిలు కాకపోవడమే దానికి కారణం.

సహజంగా జగన్ మనస్తత్వం ప్రకారమయితే.. తాను సిఫార్సు చేసిన వారికి సాంకేతిక కారణాలతో పదవులు దక్కకపోతే, ఏదో ఒక మార్గంలో గానీ, లేదా అవకాశం వచ్చినప్పుడు గానీ వారికి న్యాయం చేస్తారన్న పేరుంది. కానీ కనగరాజ్ విషయంలో మాత్రం, ఆయన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం జగన్ అభిమానులను సైతం విస్మయపరిచింది. పోనీ మానవ హక్కుల కమిషన్ ైచె ర్మన్‌గా నియమిస్తారనుకున్నా, దానికీ మాజీ న్యాయమూర్తిని ఇటీవలే నియమించారు.
 
అటు ఈ వ్యవహారం విపక్షాలకు సైతం అస్త్రంగా మారింది. ముగ్గురు అధికారుల పేర్లు సిఫార్సు చేయడం ద్వారా, జగన్ తన సిద్ధాంతాలను తానే తుంగలో తొక్కారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ‘‘రాజకీయ నాయకుల వద్ద పనిచేసిన అధికారులలో పారదర్శకత ఉండదు కాబట్టి, ఆ పారదర్శకత కోసమే రిటైర్డ్ జడ్జిని నియమించానని అప్పట్లో చెప్పిన జగన్, ఇప్పుడు మళ్లీ అదే రిటైరయిన అధికారుల పేర్లను ఎలా సిఫార్సు చేశారు? అంటే ఈ ముగ్గురిలోనూ పారదర్శకత ఉండదని జగన్ అంగీకరించినట్లేనా’ అని  వర్ల రామయ్య ప్రశ్నించారు.
 
నిత్యం రచచ్బండ పేరుతో జగన్ సర్కారు నిర్ణయాలను ప్రశ్నిస్తున్న వైసీపీ నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. దాన్ని బట్టి‘ మాట తప్పడం మా విధానం అని’ జగన్ పరోక్షంగా స్పష్టం చేశారు. కనగరాజ్‌కు సానుభూతి తెలపడం తప్ప మరేమీ చేయలేనని రాజు వ్యంగ్యాస్తాలు సంధించారు. కనగరాజ్ నివాసానికి అద్దె కూడా చెల్లించలేదన్న వార్తలు అప్పట్లో మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే.