శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (17:48 IST)

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

Sudhir Attavar,  Gopi Sundar
Sudhir Attavar, Gopi Sundar
సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొరగజ్జ’. కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో పూజించబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సుధీర్ అత్తవర్‌తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్‌ను ఓ ప్రత్యేక అనుభవంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తాను మ్యూజిక్‌లో సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి పంచుకున్నారు.
 
‘ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి. దర్శకుడికి నా పని నచ్చినందుకు, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది.  ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది’ అని అన్నారు.
 
ఈ చిత్రంలో ఆరు పాటలు ఉంటాయి, వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచారు. ఈ పాటలకు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్ వంటి ప్రతిభావంతులైన గాయకులు పాటలు పాడారు.
 
"కాంతార" సినిమా కంటే ఎంతో భిన్నంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ‘కాంతార’ ఒకరిని మాత్రమే చూపించింది. దీనిపై EP శ్రీ విద్యాధర్ శెట్టి సహాయంతో దర్శకుడు సుధీర్ అత్తవర్ పరిశోధన చేశారు. ‘కాంతార’ తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మల్టీ లాంగ్వేజెస్‌లో విడుదల కానుంది.
 
ఇందులో కబీర్ బేడి, ప్రఖ్యాత కొరియోగ్రాఫర్లు సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, దక్షిణాది అగ్ర నటులు భవ్య, శ్రుతి మరెంతో అద్భుతమైన సమిష్టి తారాగణం పని చేసింది. మనోజ్ పిళ్ళై సినిమాటోగ్రఫీ, జిత్ జోషి, విద్యాధర్ శెట్టి ఎడిటింగ్, బిబిన్ దేవ్ సౌండ్ డిజైనింగ్, మూడుసార్లు కేరళ రాష్ట్ర అవార్డు గెలుచుకున్న డిఐ కలరిస్ట్ లిజు ప్రభాకరన్ డిఐ, లవన్-కుషన్ విఎఫ్ఎక్స్ & గ్రాఫిక్స్ వంటి అసాధారణ సాంకేతిక బృందం ఈ చిత్రానికి పని చేసింది. ఇక ఈ మూవీ ఆడియో రైట్స్ కోసం భారీ రేటుని చెల్లించేందుకు పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి.