మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (12:41 IST)

జగన్ ఫోటోకు పాలాభిషేకం... జనసేన ఒక్క ఎమ్మెల్యే కూడా జంప్ జిలానీయేనా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం రాపాక వరప్రసాద్ మాత్రం ఫ్యాను సునామీని తట్టుకుని ఒడ్డునపడ్డారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఫోటోకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాలాభిషేకం చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఆయన పార్టీ మారబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. 
 
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 'వైఎస్సార్ వాహనమిత్ర' పథకంపై ఆటో, క్యాబ్ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించి, సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పినిపె విశ్వరూప్, జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లతో కలిసి జగన్ ఫొటోకు రాపాక పాలాభిషేకం నిర్వహించారు.
 
అంతే, ఆ ఫొటోలతో సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆయన పార్టీ మారబోతున్నారని, అందుకు ఈ ఫొటోనే నిదర్శనమంటూ వార్తల హోరు మొదలైంది. దీంతో రాపాక స్పందించక తప్పలేదు. ఇదంతా తప్పుడు ప్రచారమని, నమ్మొద్దని కోరారు. తనను నమ్మి అధినేత పవన్ కల్యాణ్ టికెట్ ఇస్తే, అభిమానులు, జనసైనికులు కష్టపడి తన గెలుపునకు కృషి చేశారని, వారిని వంచించబోనని స్పష్టం చేస్తూ తన ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు.