పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన జనసేన ఎమ్మెల్యే.. కార్యకర్తలు
తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వేలాది మంది జనసేన కార్యకర్తలతో కలసి మలికిపురం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. రాపాక వరప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం మలికిపురంలో పేకాట ఆడుతున్న కొంతమందిని రాపాక అనుచరులను స్థానిక ఎస్.ఐ రామారావు సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
దీంతో ఎస్.ఐతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రాపాక తమ జూదం ఆడడం లేదని, అందులోఒక వ్యక్తికి రెండు కిడ్నీలు పాడవడంతో ఆయనకు కాలక్షేపం కోసం ఆడుకుంటున్నారని తెలిజేశారు. అయితే ఎస్.ఐ ససేమిరా అనడంతో రాపాక పోలీసు స్టేషన్‌కు వచ్చి ఎస్సై రామారావుతో మాట్లాడి తమ వారిని విడిచిపెట్టాలని కోరారు. కనీసం అందులో అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తిని విడిచిపెట్టి కేసు నమోదు చేయమని కోరినట్లు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఎస్సై పట్టించుకోకపోవడంతో పాటు రాపాకను పరుష పదజాలంతో దూషించారని, ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డీఎస్పీ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే తన అనుచరులను సముదాయించి ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే స్థానిక ఎమ్మెల్యేకు కనీస గౌరవ మర్యాదలు అధికారులు ఇవ్వడం లేదని వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తినే అధికారులు అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శ అక్కడ నెలకొని ఉంది.