ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్.. ఎందుకంటే...

kcr
Last Updated: సోమవారం, 12 ఆగస్టు 2019 (09:29 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం వైకాపాకు చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంటికి వెళ్లనున్నారు. ఉదయం అక్కడే తేనీరు, అల్పాహారం తీసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా అక్కడే విందుభోజనం ఆరగిస్తారు. అసలు ఉన్నట్టుండి రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లఢం ఏంటి, అక్కడ అల్పాహారం, విందు భోజనం ఆరగించడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మ్రొక్కులు తీర్చుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఆయన కోరిక ఫలించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ఆయన వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయింది. ఈ క్రమంలో ఒక్కో దేవాలయంలో ఆయన మ్రొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు.

ఇందులోభాగంగా, సోమవార కాంచీపురం పట్టణానికి వెళ్లనున్నారు. ఈ కంచి పట్టణంలో ఉన్న వివిధ ఆలయాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే, అత్తివరదర్‌ను కూడా ఆయన దర్శనం చేసుకుంటారు.

ఇందుకోసం సోమవారం ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రోడ్డుమార్గాన తమిళనాడులోని కంచి పట్టణానికి వెళ్లనున్నారు. మార్గమధ్యంలో నగరిలోని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి, అల్పాహార, తేనీటి విందులో పాల్గొంటారు.

అక్కడి నుంచి కంచి చేరుకుని ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం, తిరుగు ప్రయాణంలో రోజా ఇంట్లోనే మధ్యాహ్న భోజనం చేసి, తిరిగి రేణిగుంట మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా, రేణిగుంటలో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.దీనిపై మరింత చదవండి :