ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (12:17 IST)

తల్లి శీలాన్ని శంకించేవాళ్లను ప్రోత్సహించే వ్యక్తి అర్జునుడా? పవన్ కళ్యాణ్

Jagan
Jagan
తన రక్తం పంచుకుని పుట్టిన చెల్లి, కన్నతల్లి శీలాన్ని శంకించే వ్యక్తుల మూకను ప్రోత్సహించే వ్యక్తి అర్జునుడా అంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
వైకాపాకు చెందిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జనసేన కండువా కప్పి, పార్టీ సభ్యత్వాన్ని పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
మంచితనానికి మారుపేరు, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం లాంటి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. 'వారి బాధ నిన్న వర్ణనాతీతం. ఆయన చాలా బాధపడిపోతున్నారు. ఆయనను అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నట్టు, ఆయనొక అర్జునుడులాగా, మేమందరం కౌరవుల్లాగా, ప్రజలే ఆయన ఆయుధాలు అని, ప్రజలే ఆయనకు శ్రీకృష్ణుడు అని మాట్లాడుతోంటే చాలా అసహ్యంగా ఉంటోంది. 
 
అర్జునుడు ఆడవాళ్లను రక్షించాడే తప్ప, తూలనాడలేదు. జగన్ తనను తాను అర్జునుడితో పోల్చుకోవడం హాస్యాస్పదంగా ఉంది. సొంత చెల్లెలు షర్మిలను అత్యంత నీచంగా మాట్లాడుతూ ఉంటే, అలా తిట్టేవారిని ఎంకరేజ్ చేసే వ్యక్తి అతను. అతను అర్జునుడుతో పోల్చుకుంటున్నాడు. 
 
తల్లి శీలాన్ని శంకిస్తున్నా మౌనమునిలా ఉండేవారిని ఏమంటారని ప్రశ్నించారు. తోడబుట్టిన చెల్లెలికి గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సొంత బాబాయ్‌ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు... వాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. 
 
తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వివేకా కూతురు డాక్టర్ సునీత చెబుతుంటే, ఇలాంటి వ్యక్తి అర్జునుడితో పోల్చుకుంటున్నాడు. ఎవరు అర్జునుడో, ఎవరు కౌరవులో నేను మహాభారతం స్థాయికి వెళ్లి మాట్లాడదలుచుకోలేదు.
 
ఇది కలియుగం. అందులో ఒకటో పాదమో, రెండో పాదమో తెలియదు కానీ... మనం ఎవ్వరం కూడా శ్రీకృష్ణుడితో, అర్జునుడితో, కౌరవులతో పోల్చుకోవద్దు. మీరు జగన్, మీది వైసీపీ... నేను పవన్ కల్యాణ్, మాది జనసేన. ఎవరు మంచి వాళ్లు, ఎవరు అండగా నిలుస్తారు, ఎవరు దోపిడీదారులో ప్రజలకు బాగా తెలుసు. స్వగతం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
 
నేను ఏ రోజూ కూడా ఆయనను తగ్గించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వలేని వాడు, మనింట్లో ఆడపడుచులకు గౌరవం ఇస్తాడని నేను అనుకోవడంలేదు. వైసీపీ ఉన్న చోటే ఇంత దిగజారుడు రాజకీయం ఉంటుంది. దేశంలో ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడా చూడలేదు. అలాగే తనను పవర్ స్టార్ అంటూ పిలవద్దని విజ్ఞప్తి చేశారు. పవర్ లేనోడికి పవర్ స్టార్ ట్యాగ్ ఎందుకన్నారు. 
 
అందుకే తన సినిమాల్లో కూడా పవర్ స్టార్ అని వేయడం మానేశానని తెలిపారు. తనను పవర్ స్టార్ అని పిలవడం కంటే ప్రజా కూలీ అని పిలవడాన్ని, సంభోదించడాన్ని గౌరవంగా భావిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు.