బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (11:06 IST)

జనసేన తీర్థం పుచ్చుకోనున్న వైకాపా ఎంపీ - ముహూర్తం ఖరారు!!

balashowry
ఎన్నికల సమీపించే కొద్దీ అధికార వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులు మెల్లగా ఆ పార్టీ నుంచి జారుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు. వచ్చే నెల నాలుగో తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. 
 
గత కొంతకాలంగా మాజీ మంత్రి పేర్ని నాని, ఎంపీ బాలశౌరిల మధ్య విభేదాలు ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మచిలీపట్నం ఎంపీగా తనకు సంబంధించిన ప్రోటోకాల్ పాటించడం లేదని పలు సందర్భాల్లో ఆయన సూచించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. సీఎం జగన్ పెద్దగా స్పందించలేదు. 
 
పైగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీ సీటు కేటాయింపుపై బాలశౌరికి స్పష్టత లేదు. తనను పక్కనబెట్టడమే కాకుండా, తనకు తెలియకుండా మరో వ్యక్తికి కేటాయించారని బాలశౌరి ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే, మచిలీపట్నం ఎంపీ స్థానంలో జనసేన తరపున ఎవరైనా పోటీ చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ తీసుకున్న తర్వాతే ఆయన పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.