సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (15:17 IST)

వైఎస్.షర్మిల రాకతో సీఎం జగన్ పనైపోయింది... : విష్ణుకుమార్ రాజు

vishnu kumar raju
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పని అయిపోయిందని భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఇదేవిషయంపై ఆయన మాట్లాడుతూ, ఇపుడు సీఎం జగన్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను షర్మిల చేపట్టడంతో వైకాపా పని అయిపోయిందన్నారు. జగన్ పార్టీలో ఉన్నవారు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారేనని ఇపుడు వీరంతా ఆ పార్టీని వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలిపారు. 
 
ఒక ఎమ్మెల్యేకు సంవత్సరం, ఒకటిన్న సంవత్సరం నుంచి సీఎం అపాయింట్మెంట్ లేకపోతే అదేం పార్టీ, దిక్కుమాలిన పార్టీ అని అన్నారు. ఇది చాలా అవమానంతో కూడుకున్న వ్యవహారమని, అలాంటి పార్టీలో ఎమ్మెల్యేలు ఉండటం వారికి సిగ్గుచేటని చెప్పారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వారే కనుక, రాబోయే రోజుల్లో వైకాపా నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అన్నారు. షర్మిల వల్ల వైకాపా ఓటు బ్యాంకు కనీసం పది శాతం చీలుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. 
 
ఏపీలో బీజేపీ - జనసేన మధ్య, జనసేన - టీడీపీల మధ్య పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలవాల్సి ఉందని విష్ణు కుమార్ రాజు తెలిపారు. ఈ మూడు పార్టీలు కలిస్తే మాత్రం ఏకంగా 150కి పైగా సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.