మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (17:48 IST)

ఎన్నికల లోపు యాత్ర-2 సెన్సార్ చేయవద్దు: నట్టి కుమార్ డిమాండ్

Yatra 2- nattikumar
Yatra 2- nattikumar
తెలుగు రాజకీయ కథా చిత్రం  "యాత్ర-2" సెన్సార్ ను లోక్ సభ ఎన్నికల తర్వాతే చేయాలన్న అభిప్రాయాన్ని  ప్రముఖ నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, తెలుగుదేశం పార్టీ  సానుభూతిపరుడు నట్టి కుమార్ వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ లెటర్ ను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ చైర్ పర్సన్, సీఈఓ, హైదరాబాద్ రీజినల్ సెన్సార్ ఆఫీసర్ కు రాశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.యస్.ఆర్.పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఈ సినిమాను తీశారని ఆయన ఆ లెటర్ లో పేర్కొన్నారు.  ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి, అలాగే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధినేత సోనియాగాంధీకి వ్యతిరేకంగా,తీయడంతో పాటు  వారి పాత్రలను కించపరుస్తూ, వ్యంగ్యంగా ఈ చిత్రంలో  చిత్రీకరించారని ఆయన వివరించారు.
 
తాజాగా పబ్లిసిటీ కోసం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌నే ఇందుకు ఓ ఉదాహరణ అని, వారితో దగ్గరి పోలికలు ఉన్న ఆర్టిస్టులను ఈ సినిమాలో పెట్టి  కుట్రదారులుగా చూపించారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియాగాంధీని,  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడును చులకనగా చూపించడం వెనుక త్వరలో జరగబోయే  లోక్‌సభ ఎన్నికల్లో  ప్రత్యేకంగా  వై.యస్.ఆర్..కాంగ్రెస్ పార్టీ ,ప్రయోజనం పొందాలన్న ఉద్దేశ్యం కనిపిస్తోందని తెలిపారు.  .
 
త్వరలో  లోక్ సభ ఎన్నికల కోడ్ రాబోతున్న సమయంలో ఈ సినిమాను కరెక్టు గా ఇదే టైం లో విడుదల చేసేందుకు నిర్ణయించడం కూడా దురుద్దేశమే. మరో విషయం ఏమిటంటే. ఇంకా సెన్సార్ చేయకుండానే  ఈ సినిమా విడుదల తేదీని ఫిబ్రవరి 8వ తేదీగా ప్రకటించారు. వాస్తవానికి సెన్సార్ మార్గదర్శకాల ప్రకారం సెన్సార్ జరపకుండా  విడుదల తేదీని ప్రకటించడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై కూడా సెన్సార్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈ చిత్రాన్ని సెన్సార్ చేయవద్దని మనవి చేస్తున్నాను. ఎన్నికల తర్వాతే సెన్సార్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను, అప్పుడు కూడా ఈ చిత్రంలోని  పాత్రలు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, వ్యంగ్యంగా, అవమానకరంగా, కుట్రపూరితంగా లేకుండా సెన్సార్ చేయాలి. . సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం సినిమా సెన్సార్ చేయడానికి  66 రోజుల వరకు వ్యవధి  ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి సున్నితమైన రాజకీయ అంశాలతో కూడిన సినిమాను సెన్సార్ చేయడం ఈ టైమ్ లో  కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
 
ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఎన్నికలకు ముందు విడుదలైతే ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఎన్నికల తర్వాత ఈ సినిమాకి సెన్సార్ జరగాలి. అలాగే సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకున్న చాలా చిత్రాలను ప్రాధాన్యతా క్రమంలో మాత్రమే చూడాలి. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడా ఉండకూడదు.
పైన పేర్కొన్న మా నాయకులను కించపరిచే సన్నివేశాలతో  ఈ చిత్రాన్ని ఎన్నికల ముందు సెన్సార్ లేదా విడుదల చేయడానికి ప్రయత్నించినట్లయితే, మేము లీగల్ గా  ముందుకు వెళ్తానని మీకు తెలియజేస్తున్నానని నట్టి కుమార్ తాను రాసిన లెటర్ లో పేర్కొన్నారు